చిచ్చు కాంగ్రెస్ పుణ్యమేనా?
టీఆర్‌ఎస్‌ను అడ్రస్ లేకుండా చేసిన తర్వాత ఇక ప్రజారాజ్యంపై పడాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అయితే టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించినట్టు కాకుండా పీఆర్పీ విషయంలో బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇటీవలి ఎన్నికల్లో 16 శాతం వోట్లు పొందిన పీఆర్పీ ఏయే సామాజిక వర్గాల నుంచి ఆ వోట్లు సాధించిందో కనుగొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయావర్గాలకు ఇప్పటికే ప్రభుత్వపరంగా అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా పథకాలకు రూపకల్పన చేయటం ఈ వ్యూహంలో ఒక భాగం.
ఆయా సామాజిక వర్గాల నేతలను వీలైతే తమవైపు తిప్పుకోవటం, అలా కాకపోతే వారు వచ్చిన స్వంత పార్టీలకు తిరిగి వెళ్ళేలా చేయటం వ్యూహంలో రెండవ కోణం. ఇప్పటికే ఈరెండవ కోణం దిశగా ప్రయత్నాలు ప్రారంభమైనట్టు విశ్వసనీయ సమాచారం. ఆ విధంగా ఆయా సామాజిక వర్గాల వోట్లను తమకు అనుకూలంగా మలచుకుని, వచ్చే ఎన్నికలకు మార్గాన్ని మరింత సుగమం చేసుకోవటం, ఆ సామాజిక వర్గాల నేతలను పీఆర్పీకి దూరం చేయటం ద్వారా నాయకత్వ లోపం సృష్టించి ప్రయోజనాలు కాపాడుకోవాలన్న బహుముఖ వ్యూహానికి కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటినుంచే శ్రీకారం చుట్టినట్టు ఆయా పార్టీలలో చర్చ తీవ్రంగా జరుగుతున్నది. రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని, అందుకోసం ఇప్పటినుంచే కృషి మొదలు పెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.
Pages: -1- 2 News Posted: 15 June, 2009
|