ఆయన ఇప్పుడు జనం మంత్రి
ఆయన ముందుగా అందుకున్న పిటిషన్లలో ఒకటి పంట కాలం ఆరంభంలో ఎరువుల కొరత గురించి స్థానిక రైతుల సంఘం చేసిన ఫిర్యాదుకు సంబంధించినది. సేద్యం ప్రారంభించడానికి క్రితం సంవత్సరం తాము బ్లాక్ మార్కెట్ లో ఎరువులను కొనుగోలు చేయవలసి వచ్చిందని సంఘం తెలియజేసింది. అళగిరి వెంటనే స్పందించి చర్య తీసుకున్నారు. రాష్ట్ర గోదాములలో నుంచి 2400 టన్నుల డై అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి) ఎరువును విడుదల చేయించి మదురైలో రైతులకు ఆయన పంపిణీ చేయించారు. 'అళగిరి ఏక్షన్'కు వచ్చిన ప్రచారంతో ఆయన ఇంటి వద్దకే మరిన్ని ఫిర్యాదులు రాసాగాయి.
'మాకు సాధారణంగా ప్రతి సోమవారం దాదాపు 500 నుంచి 600 వరకు పిటిషన్లు అందుతుంటాయి. కాని గత రెండు వారాలలో వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. మాకు అందుతున్న పిటిషన్లు 200 లోపే ఉంటున్నాయి. పిటిషనర్లు మంత్రి నివాసానికి వెళుతుండడమే ఇందుకు కారణం' అని మదురై కలక్టరేట్ లోఒక అధికారి చెప్పారు. అయితే, అళగిరికి సమర్పించే పిటిషన్లలో అధిక భాగం సముచిత చర్య కోసం తిరిగి కలెక్టరేట్ కు పంపుతున్నారని ఆయన తెలిపారు.
కాగా, దురుసుగా ప్రవర్తిస్తుంటారనే పేరును వదిలించుకుని ప్రజల మంత్రిగా ఖ్యాతిని ఆర్జించడానికి అళగిరి ప్రయత్నం చేస్తున్నది తన తమ్ముడు ఎం.కె. స్టాలిన్ తో వారసత్వ పోరాటంలో తనకు బలమైన స్థానం పొందాలనే తపనతోనేనని డిఎంకె ఆంతరంగికులు చెబుతున్నారు. 'స్టాలిన్ ను ఉప ముఖ్యమంత్రిని చేసినప్పటి నుంచి ఆయన సమావేశాలు, విధాన నిర్ణాయక ప్రక్రియ గురించి ప్రధానంగా ప్రచారం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎక్కువగా ప్రయత్నిస్తున్నది. అందువల్ల తాను పాలనకు కొత్తవాడినైనా తనలో కూడా ఉత్సాహం, చురుకుదనం తక్కువగా ఏమీ లేవని నిరూపించుకోవాలని అళగిరి కోరుకుంటున్నారు' అని సీనియర్ డిఎంకె మంత్రి ఒకరు చెప్పారు.
సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎంతగా ఉన్నదీ ఇటీవల ఒక సందర్భంలో అందరి దృష్టికి వచ్చింది. మదురై పొరుగు జిల్లా రామనాథపురం జిల్లాలో ఒక మంచినీటి పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి స్టాలిన్ హాజరైనప్పుడు ఇది జరిగింది. తమ తండ్రి కరుణానిధి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ అళగిరి ఈ కార్యక్రమానికి దూరంగానే ఉండిపోయారు. ఆయన మదురైలోని తన నివాసంలో పిటిషన్లు స్వీకరిస్తుండిపోయారు.
Pages: -1- 2 News Posted: 16 June, 2009
|