తెరాసలో ప్రక్షాళన
తమ వ్యవహారశైలి గతంలో మాదిరిగా ఉంటే, భారీ ఎత్తున వలసలు ఉంటాయనే భయం టిఆర్ఎస్ నేతలను పీడిస్తోంది. సమీక్షా సమావేశాలకు కూడా ఆశించిన సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పార్టీ కార్యాలయానికి రావడం లేదు. జూబ్లీహిల్స్ లో పార్టీ కార్యాలయం సందడిగా ఉండాలని, సమీక్షా సమావేశల సమయంలో పట్టుమని 50 మంది కూడా కార్యకర్తలు రాకపోవడంతో బోసిపోయి కనబడుతోందని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురు అసమ్మతి నేతలు బలమైన నేతలు కాకపోయినప్పటికీ మీడియాలో, జనంలో టిఆర్ఎస్ పై బురదజల్లడంలో సఫలమైనా, తిరుగుబాటు ఊపు కొనసాగించడంలో విఫలమయ్యారు. రాజకీయంగా తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి రాష్ట్ర కమిటీ సమావేశం జరిగే వరకు వేచిచూసి, సమావేశంలో గళం విప్పి బయటపడి ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ నుండి సస్పెండైన తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి కొనితెచ్చుకుని, మళ్ళీ లీగల్ గా పోరాడుతామని యోచించడంతో వీరు ఇక మరెంతోకాలం అసమ్మతి క్యాంపు నిర్వహించలేరని తేలిపోయినట్లు టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఐదుగురు అసమ్మతి నేతల్లో జిట్టా బాలకృష్ణారెడ్డికి మాత్రం కాస్తో, కూస్తో పట్టుంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. యెన్నం శ్రీనివాసరెడ్డి సమర్ధుడైన నేత అయినప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాకే పరిమితం. ఇక బీరవెల్లి సోమిరెడ్డి కూడా నల్లగొండకే పరిమితం కావడం గమనార్హం. అలాగే తెలంగాణ విమోచన సమితి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించి ఆ తర్వాతనే తమ వైఖరిని ప్రకటించాలని టిఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం టిఆర్ఎస్ వ్యతిరేక గాలి తీవ్రంగా ఉంది. మేధావులు, రచయితలు, సామాన్య జనం కెసిఆర్ వైఖరిపై మండిపడుతున్నారు. ఈ జనమంతా రానున్న రోజులలో దిలీప్ కుమార్ ఆధ్వర్యంలోని తెలంగాణ విమోచన సమితి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అసమ్మతివాదులు లేదా దిలీప్ కుమార్ చేసిన డిమాండ్లను కెసిఆర్ ఇంతవరకు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో విమోచన సమితిపై తొందరపడి ఎలాంటి ప్రకటనలు చేయరాదని, దీనివల్ల పార్టీలో సంక్షోభం మరింత ముదురుతుందనే భయం టిఆర్ఎస్ నాయకత్వాన్ని వెంటాడుతోంది.
Pages: -1- 2 News Posted: 18 June, 2009
|