రాజీనామా వ్యూహమేనా?
ఈ నేపథ్యంలో తనపై నలమూలల దాడులు పెరగడంతో కెసిఆర్ దిగిరాక తప్పలేదు. తొలుత దాడులకు విరుగుడుగా తనపై కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ బాంబు పేల్చినా అది ఆయన ఆశించిన స్ధాయిలో స్పందన కనిపించకపోవడంతో కొత్త వ్యూహానికి తెరలేపారంటున్నారు. వరసదాడుల నుంచి తప్పించుకోవడంతో పాటు, సానుభూతి పెంచుకో వడానికి రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే, ఈవాదనకు మరింత బలం చేకూరు తుంది. ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్ పలుకుబడి పలుచబడిందని, పార్టీలో తిరుగుబాట్లు తీవ్రం కావడంతో ఇక పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్న వార్తల నేపథ్యంలో వాటినుంచి సాను భూతి సంపాదించుకునేందుకే రాజీనామా చేశా రన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ కోసం ఢిల్లీ స్థాయిలో కష్టపడి, రాష్టప్రతి ప్రసంగంలో కూడా ఆ అంశాన్ని చేర్పించిన కెసిఆర్‌ను నాయకులు ఒంటరి చేసి, ఆయనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయాన్ని జనంలో కలిగించడం వల్ల..అసలు విషయం మరుగు నపడి, రాజీనామాలో పేర్కొన్న అంశాలకే ప్రాధాన్యం పెరుగుతుందన్న వ్యూహమే కనిపి స్తోంది. గతంలో ఇదే జూన్‌లో అందరితో రాజీనా మాలు చేయించిన తర్వాత జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముందు కూడా ఇలాగే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖ ఇవ్వడం, రాష్ట్ర కార్యవర్గం దానిని తిరస్కరించడం తెలిసిందే. మళ్లీ జూన్‌లోనే ఇలాంటి వ్యూహానికి తెరలేపడం ప్రస్తావనార్హం.
ఇప్పుడు కూడా అదే కథ పునరావృత మవుతుందంటున్నారు. శనివారం జరిగే రాష్ట్ర కార్యవర్గసమావేశంలో నాయకులంతా కెసిఆర్‌ను బ్రతిమిలాడటం, ముందు ఆయన వారి కోరికను తిరస్కరించడం, కొందరు నాయకులు తాము కూడా సామూహిక రాజీనామా చేస్తానని స్పష్టం చేయడం, దానితో కెసిఆర్ వెనక్కి తగ్గి రాష్ట్ర కార్యవర్గం అభ్యర్ధన మేరకు రాజీనామాను ఉపసంహరించుకుంటానని చెప్పడం జరుగు తుందని కొందరు నేతలు రేపటి కార్యవర్గ సమావేశ ఫలితాన్ని ముందే వెల్లడిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 19 June, 2009
|