సమీక్షలతో సయోధ్య
నల్గొండ జిల్లాలో బయటికి కనిపించకపోయినా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. జిల్లాలో సీనియర్ నేతలుగా, గతంలో మంత్రులుగా పనిచేసిన జానారెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డిలను ఈ సారి పక్కన పెట్టి వారి కంటే జూనియర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వైఎస్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇది జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు. అందరూ కలిసి ఉన్నట్లు బయటికి చెప్పుకుంటున్నా అంతర్గతంగా మాత్రం వీరి మధ్య గట్టి పోరు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వారం రోజుల క్రితం జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి సీనియర్లు, మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తం కుమార్ రెడ్డి తదితరులు హాజరు కాలేదు. మంత్రి కోమటిరెడ్డితో వారికి ఉన్న విభేదాలే దీనికి కారణమనే ఆరోపణలు జిల్లా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖకు చాలా కాలం నుంచి పడదని జిల్లా నేతలు చెబుతున్నారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పొన్నాల, కొండా వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ ఇద్దరు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు కలిసి ఉన్నట్లు వ్యవహరిస్తున్నప్పటికీ అంతర్గతంగా వీరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలోనే ఉన్నట్లు జిల్లాకు చెందిన పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. జిల్లాలో పొన్నాల, కొండా సురేఖ భర్త కొండా మురళికి పడదు. అలాగే వరంగల్ ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య, మేయర్ స్వర్ణ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో హో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, జిల్లాకు చెందిన పలువురు పార్టీ ఎమ్మెల్యేల మధ్య కూడా విభేదాలున్నట్లు పార్టీ వర్గాలసమాచారం. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ ఇప్పటికే సబితపై కస్సుబుస్సు మంటున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మొదటి నుంచే సబితకు వ్యతిరేకి. మరి కొందరు మాజీ ఎమ్మెల్యేలు, క్రియాశీలక నేతలతో జిల్లా మంత్రికి మధ్య సమన్వయం, సహకారం సరిగాలేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
Pages: -1- 2 News Posted: 24 June, 2009
|