చిత్తైన సీనియర్లు
సార్వత్రిక ఎన్నికలకు ముందు హైదరాబాద్ కు వచ్చిన సోనియాగాంధీ తెలంగాణ విషయంలో సిద్ధాంతపరంగా అభ్యంతరాలు లేవని పేర్కొంది. సోనియాగాంధీ చేసిన ఈ ప్రకటనను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని విమర్శలొస్తున్నాయి. ఎలాగూ పార్టీ అధినేత్రి తెలంగాణపై ప్రకటన చేశారు. కాబట్టి రేపు అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఈ సీనియర్లు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యారు.
పైగా ఎన్నికల ప్రయోజనాలను సైతం అర్థం చేసుకోకుండా ఈ వృద్ధ మేధావులు కీలక కాలంలో వైఎస్ పై విమర్శలు చేసి కష్టాలను కొనితెచ్చుకున్నారు. రాష్ట్రంలోని తొలి విడత ఎన్నికలయ్యాక నంద్యాల సభలో వైఎస్ చేసిన వ్యాఖ్యలపై జి వెంకటస్వామి, ఎమ్మెస్సార్ తదితర నేతలు స్పందించిన తీరు అవసరానికి మించి చేశారని రాజకీయ విశ్లేషకుల వాదన. తెలంగాణ అంశాన్ని పక్కనపెట్టిన సిఎంకు పోయేకాలం వచ్చిందని తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతుందని కాంగ్రెస్ సీనియర్లు పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యనాలు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలను ఇరకాటంలోకి నెట్టాయి. నంద్యాలలో సిఎం చేసి వ్యాఖ్యలపై ఈ సీనియర్లు మిడియా ముందు స్పందించకుండా కొంత సంయమనం పాటించివుంటే వారి చేతుల్లో తెలంగాణ అస్త్రం సజీవంగా ఉండేదని వారు పేర్కొంటున్నారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 50 స్థానాలను గెలుచుకుంది. ఈ ప్రాంతంలో 2004 ఎన్నికలలో కాంగ్రెస్ సాధించిన స్థానాలు 45 మాత్రమే. అంటే గతంలో కంటే ఐదు స్థానాలు కాంగ్రెస్ కు పెరిగాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలం అని చెప్పినందువల్లే తెలంగాణలో 50 స్థానాలను గెలుచుకోగలిగామని ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం కాంగ్రెస్ సీనియర్లు చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఇలా చేసివుంటే ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పై ప్రజలు విశ్వాసం ఉంచడం వల్లే 50 అసెంబ్లీ స్థానాలను ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకునే అవకాశముండేది. కానీ ఈ నేతలు ఎన్నికల సమయంలో నంద్యాలలో సిఎం చేసిన వ్యాఖ్యలపై అతిగా స్పందించారని, తెలంగాణలో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని చెప్పడం వారి కొంపలు ముంచాయి. ప్రస్తుతం రెండోసారి పార్టీని విజయపధంలో నడపడంతో వైఎస్ కు అధిష్టానం వద్ద బలం పెరిగింది.
Pages: -1- 2 News Posted: 30 June, 2009
|