కొరివిగా మారిన యాదవ్
డిజిపిగా యాదవ్ ను తిరిగి తీసుకోవడంపైనే కొంతమంది మంత్రులు అయిష్టత వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న వ్యక్తికి న్యాయం చేయాలన్న ఒకే ఒక కారణంతో ముఖ్యమంత్రి ఆయనకు డిజిపి పదవి కట్టబెట్టారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కానీ ఆయన పదవిలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఇష్టానుసారంగా వ్యవహరించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వచ్చీ రావడంతోనే ఎన్నికల ముఖ్య అధికారితో వివాదానికి దిగారు. తనను తీసివేయడానికి కారణాలు తెలపాలని లేఖాస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. ఎన్నికల అధికారి సుబ్బారావు డిజిపి వైఖరిపై ప్రభుత్వం ముందు అసహనం ప్రదర్శించారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వివాదానికి తెర దించారు.
కీలక శాఖల్లోని వ్యక్తులపై అనవసర పెత్తనానికి దిగుతున్నారనే మరో వివాదం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఇంటిలిజెన్స్ చీఫ్ తో పలువురు అదనపు డిజిలకూ ఏకంగా అంతర్గత మెమోలు ఇవ్వడం సమస్యకు కారణమైంది. సంబంధిత ఐజిలు, డిఐజీలను పక్కన పెట్టి, తానే స్వయంగా ఎస్పీలకు ఆదేశాలు ఇస్తున్న తీరుపై కొంతమంది ఐజిలు నొచ్చుకుంటున్నారు. పోలీసుశాఖలో వివాదరహితుడుగా, ప్రజలను మెప్పించే అధికారిగా పేరు తెచ్చుకున్న శాంతి భద్రతల అదనపు డిజి ఎకె ఖాన్ కు సైతం యాదవ్ వైఖరి పట్ల అసంతృప్తి చెందినట్లు పోలీసుశాఖలో చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం తనకు అండగానే ఉందనే ఒక్క సాకుతో డిజిపి ఎవరినీ లెక్కజేయడం లేదని, దీనివల్ల పలు సమస్యలు వస్తున్నాయని నిఘా విభాగం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది.
తమ రేంజ్ పరిధిలోని ముఖ్యమైన విషయాలను కూడా చెప్పుకునే అవకాశం చిక్కడం లేదని, డిజిపిని కలుసుకోవడం కష్టంగా ఉందని కొంతమంది ఐజిలు అంటున్నారు. ఇక జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఇవే ఆరోపణలు వస్తున్నాయి. తమ నియోజకవర్గాల పరిధిలో ఏ సమస్యను తీసుకువెళ్ళాలన్నా ఎస్పీలు, డిజిలు, ఐజిలు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అంతా డిజిపినే చూసుకుంటున్నారని, ఏదైనా ఆయనకే చెప్పాలని అధికారులు దాట వేస్తున్నారనేది అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆవేదన. తాజాగా డిఎస్పీల నియామకం విషయంలోనూ యాదవ్ కు హోంమంత్రికి మధ్య అంతరం పెరిగింది.
25 మంది డిఎస్పీలకు ఇచ్చిన పోస్టింగ్ లు వివాదాస్పదమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యేలు కొంతమంది అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా, తమకు నచ్చని అధికారులను నియోజకవర్గాలకు పంపితే ఎలా అని హోంమంత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తయితే డిజిపి వైఖరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని ఇంటిజెన్స్ అధికారులు సిఎం వద్ద మొరపెట్టుకుంటున్నారు. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని హోంశాఖను చక్కదిద్దాలంటే డిజిపి మార్పు అనివార్యమని సిఎం సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ఇక డిజిపి తలనొప్పికి చెక్ పెట్టాలనే భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
Pages: -1- 2 News Posted: 1 July, 2009
|