కేసీఆర్ కసరత్తు
అసమ్మతి వాదుల్లో ప్రజాబలం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన కేకే మహేందర్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ నాయకులు, శ్రేణులు పార్టీవెంటే ఉండేలా, మహేందర్ రెడ్డి వెంట ఎవరూ వెళ్ళకుండా చూసే విషయంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇకనుంచి జిల్లాలోనే ఎక్కువ కాలం గడిపి పార్టీని పటిష్టం చేయడంతో పాటు తెలంగాణ శక్తులను పునరేకీకరించే దిశలో కూడా ప్రయత్నాలు కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసమ్మతివాదులు తమ గళాలను వినిపించడం ద్వారా తీవ్ర మానసిక వ్యధకు గురైన కేసీఆర్ ఇకముందు అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ అధిష్టానం పట్ల, తనపట్ల విముఖంగా ఉన్న పార్టీ నాయకులను గుర్తించి వారిని దగ్గర చేసుకునేందుకు కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే అసమ్మతి గూటికి వెళ్ళి కేసీఆర్ ను వ్యక్తిగతంగా తీవ్ర పరుష పదజాలంతో విమర్శించిన పలువురిని తిరిగి పార్టీ గూటికి చేర్చుకోవడంలో కొంత మేర కేసీఆర్ సఫలమయ్యారు.
మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, మాజీ ఎంపి డి.రవీంద్రనాయక్, పార్టీ ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్, మాజీ బీసీ సెల్ అధ్యక్షుడు దేవర మల్లప్ప వంటివారిని తిరిగి తెరాసలోకి రప్పించడంలో విజయవంతమైన కెసీఆర్ తిరిగి రెహ్మాన్ ను మాత్రం అసమ్మతి వైపునకు వెళ్ళకుండా నిలువరించలేకపోయారు. తిరిగి అసమ్మతి గూటికి చేరిన రెహ్మాన్ తన ఆరోపణలకు మరింత పదనుపెట్టారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జిట్టాకు మంచి పట్టుంది. ఈ నియోజకవర్గంపై కూడా కేసీఆర్ ప్రత్యేక దృష్టి ఇప్పటికే సారించినట్లు సమాచారం. మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులతో ఇప్పటికే కేసీఆర్ స్వయంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Pages: -1- 2 News Posted: 6 July, 2009
|