నారా వారి నోట్ల సూత్రం!
కొండ మీద కోతినైనా డబ్బుతో కిందకు దింపివేయవచ్చని, కాంగ్రెస్ పార్టీ అలా చేసే రెండో సారి అధికారంలోకి వచ్చేసిందని చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వెలువడిన ఉత్తర క్షణం నుంచీ చాలా బలంగా విశ్వసిస్తున్నారు. ఆతరువాత ఆయన ఏ పార్టీ మీద మాట్లాడినా డబ్బు ప్రస్తావన లేకుండా ఉండలేదు. కొత్తగా పార్టీ పెట్టిన చిరంజీవిని ఆరోపణల పరంపరతో ఊపిరితీసుకోనివ్వలేదు. కోవర్టు ప్రయోగాలతో ప్రజారాజ్యం పార్టీని ఎన్నికలకు ముందే తూట్ల, తూట్లు పొడిచారు. టిక్కెట్లు అమ్ముకుంటూన్నారంటూ ప్రజారాజ్యాన్ని వదిలి తెలుగుదేశంలో చేరిన ప్రతీ కోవర్టు నాయకుడి చేతా విపరీతంగా ప్రచారం సాగించారు. ఈ ప్రచారాన్ని జనం నమ్మేరో, లేదో తెలీదు కాని మొత్తం ప్రాణాలు తీసేయకుండా కొన ఊపిరతో వదిలేశారు ప్రజారాజ్యం పార్టీని. గ్రేటర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా చంద్రబాబు ప్రజారాజ్యానికి ప్రజల ఉంచిన ఊపిరిని కూడా తీసేయాలని సంకల్పించారు. మొన్నటి ఎన్నికల్లో చిరంజీవి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి టిక్కెట్లు అమ్ముకున్నారని చంద్రబాబు నిర్ధారించేరు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి తీసుకురావడానికి సంప్రదింపులు జరపమని సీనియర్ నాయకులకు చంద్రబాబు స్పష్టమైన బహిరంగ ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పటికీ ఆంధ్రరాష్ట్ర ప్రజలు నిజాయితీపరుడని నమ్ముతున్న లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ కూడా ముడుపుల దేవుడే అని చంద్రబాబు లోకానికి హఠాత్తుగా చాటి చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఏకంగా 59 కోట్ల రూపాయలు జేపీ ముడుపు స్వీకరించారని లెక్కతో సహా వాక్రుచ్చారు. జయప్రకాశ్ ఈ డబ్బుతీసుకుని తెలుగుదేశాన్ని ఓడించడానికి కాంగ్రెస్ కు సాయపడ్డారని, అసలు లోక్ సత్తా పోటీ చేయకపోతే తెలుగుదేశం సత్తా దేశానికి తెలిసేదని ఆయన ఢంకా భజాయించారు. కాబట్టి ఐఎఎస్ ఉద్యోగం వదిలేసి సమాజంలో, రాజకీయాలలో విలువల కోసం పాటుపడుతున్న జయప్రకాశ్ నారాయణ కూడా డబ్బుకు బానిసేనని చంద్రబాబు నిర్మొహమాటంగా నమ్ముతున్నారు. అందరినీ నమ్మమంటూన్నారు. అటు ప్రజారాజ్యం చిరంజీవి అయినా, ఇటు లోక్ సత్తా జయప్రకాశ్ అయినా పైసా మే పరమాత్మ ను చూసినవారేనన్నది నారా వారి తాజా రాద్ధాంతం కాదు కాదు సిద్ధాంతం.
విశ్వ విఖ్యాతి గాంచిన నారా వారి ప్రవచనాలను గత నెల రోజులుగా వింటున్న అశేష ఆంధ్ర ప్రజలకు అర్ధమైంది ఒకటేనట. కాంగ్రెస్ నేతలైన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహా అవినీతి పరుడు. డబ్బులతో ఆడపిల్లల శీలాలను, రాజకీయనాయకుల బలాలను కోనేయగల విలువలు లేని రాజకీయనాయకుడు. ఆయన మంత్రులూ మహా అవినీతి పరులే. మరి చిరంజీవి టిక్కెట్లు అమ్ముకోడానికే ప్రజారాజ్యం పార్టీని పెట్టిన వాడు. అవినీతిలో పీకల దాకా కూరుకుపోయాడు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ జీవిత ధ్యేయం తెలుగుదేశానికి అధికారాన్ని దక్కనివ్వకపోవడం. దానికోసం ఆయన కాంగ్రెస్ ఏజెంటుగా మారి ఆ పార్టీ నుంచి కోట్ల రూపాయలను ముడుపులుగా అందుకున్నాడు. మరి నిజాయితీ పరులెవరైనా మిగిలారా... రాజకీయాల్లో డబ్బు వాసనే కిట్టని వారెవ్వరూ లేరా?... భలే భలే ఎందుకు లేరు? అందులో శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు అగ్రగణ్యులు. రెండో వారు తెరాస అధినేత కేసీఆర్... మూడో వారు సిపిఎం రాఘవులు నాలుగో వారు సిపిఐ నారాయణ. ప్రస్తుతం చంద్రబాబు నోటి బారిన పడని వీరే చివరికి నిష్కళంకులుగా మిగిలారు.
Pages: -1- 2 News Posted: 7 July, 2009
|