ఎన్నికలకు ముందు చిరంజీవిలో భూతాన్ని చూసిన చంద్రబాబుకు ఎన్నికల తర్వాత లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణలో దెయ్యం కనిపించడం ప్రారంభించింది. లోక్ సత్తా పేరు వింటేనే ఆయనకు నరనరాన వణుకు పుట్టుకువస్తోంది. లోక్ సత్తామీద దాడి చేయడానికి ఏకంగా తెలుగుదేశంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ లోక్ సత్తాకు వచ్చిన ఓట్ల సంఖ్య ఈ వణుకుకు కారణం. లోక్ సత్తా అనే పార్టీ ఆంధ్రదేశంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీకి మరో పాతిక సీట్లు అదనంగా గెలుచుకుని ఉండేదని ఆ పార్టీ సాంకేతిక విభాగం విశ్లేషణలు చేసి చంద్రబాబు ముందు పెట్టినప్పటినుంచి మంట మొదలైంది. మరీ ఈ పార్టీ రంగంలో ఉంటే తెలుగుదేశానికి ఈ రాష్ట్రంలో అధికారం కల్లేనన్న పీడకల మొదలైంది. దానితో వ్యూహాత్మక దాడి ముసుగులో చంద్రబాబు బహిరంగంగానే ఒక రాజకీయ పార్టీని హత్య చేయడానికి పథకాలను రచిస్తున్నారు.
మొత్తం పార్టీపై కాకుండా పార్టీకి ప్రాణనాడిగా ఉన్న వ్యక్తిపై దాడి చేయడం చంద్రబాబు కొత్త ఎత్తుగడగా నమ్ముతున్నారు. ఆ నమ్మకంలో భాగంగానే ఆయన కత్తిని సరాసరి జయప్రకాశ్ నారాయణ మీదకే విసిరారు. అవినీతి ఆరోపణల చట్రంలో జెపీని ఇరికించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అనూహ్యంగా జరిగే దాడికి ప్రతిదాడి ఉంటుందనే సహజ సూత్రంతో లోక్ సత్తా మీదకు చంద్రబాబు ముడుపుల ఆరోపణలను సంధించారు. కాంగ్రెస్ కు అనుకూలంగా లోక్ సత్తా వ్యవహరించడానికి జెపీ ఏకంగా 59 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని ఆయన చేసిన ఆరోపణ సహజంగానే లోక్ సత్తాలో ఆగ్రహాన్ని రగిలించింది. దీనిని ప్రదర్శించడానికి కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ ముందు మౌన ప్రదర్శన జరిపారు. దీనికి ధర్నా అని రంగు పులిమి తెలుగుదేశం ఇప్పుడు మొత్తం పార్టీపైనే వ్యతిరేక ప్రచారానికి రంగం సిద్ధం చేసింది. ఏనాడూ ధర్నాలు చేయని లోక్ సత్తా తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాత్రమే ధర్నా చేసింది కాబట్టి ఇది అనుకూలమైన పార్టీగా ముద్ర వేయడానికి తెలుగుదేశం నాయకులు నానా తంటాలు పడుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు ఎదుట ప్రధాన శత్రువు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం కాదు. కనీసం పదేళ్ళ తర్వాతైనా తాను పదవిని అధిష్టించాలంటే కాంగ్రెస్ తో ముఖాముఖి తలపడితేనే సాధ్యమౌతుందని మధ్యలో వచ్చే కొత్త పార్టీలతో తలనొప్పేనని ఈ ఎన్నికల్లో బొప్పి కట్టిన తర్వాత ఆయనకు అర్థమైంది. గ్రేటర్ ఎన్నికల్లోగా లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలను ఘోరంగా దెబ్బతీయడానికి చంద్రబాబు తాను ఇన్నేళ్ళుగా నేర్చుకున్న రాజకీయాన్ని వేస్తున్న ఎత్తుగడలను ఇంకా చాకచక్యంగా ప్రదర్శిస్తారు.