శ్రీవారి డాలర్ల దొంగలెవరు?
పరమ పవిత్రమైన టిటిడి దేవస్థానాన్ని ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటుండగా ఇక్కడి అధికారులు మాత్రం తమదైన శైలిలో రాజకీయాలు నడపడమే విశేషం. వీరిని ప్రశ్నించే అధికారం సాక్షాత్ దేవస్థాన ఉన్నతాధికారి అయిన టిటిడి కార్యనిర్వహణ అధికారికే లేదని పేర్కొనడం వెనుక వీరికున్న అర్థబలం, అంగబలాన్ని గుర్తు చేస్తున్నాయి. దేవస్థానం విధివిధానాల ప్రకారం శ్రీవారి బంగారు డాలర్లను కొండదిగువనున్న శ్రీవారి ఖజానా నుండి రోజువారి అవసరానికి అనుగుణంగా కొండలరాయుని సన్నిధికి చేరవేస్తుంటారు. వీటిని ముందుగా పరాపతేదారు, బొక్కసం ఇంచార్జ్ గా వ్యవహరించే వ్యక్తి డాలర్లను లెక్కగట్టి షరాబుకు అప్పజెపుతారు. వీటి అమ్మకాలకు సంబంధించి వారానికి ఒకసారి పరాపతేదారు, 15 రోజులుకోమారు ఆలయం సూపరింటెండెంట్, నెలకో సారి టెంపుల్ పేష్కార్ లెక్కలు చూస్తారు. వీరందరిపై ఆలయ డిప్యూటీ ఇవో పర్యవేక్షణ చేస్తారు. వీరందరి చర్యలను దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిశీలించి నిర్ణయాన్ని దేవస్థానం కార్యనిర్వహణ అధికారికి పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది.
ఇన్ని రక్షణ చర్యలు చేపట్టినా 300 బంగారు డాలర్లు మాయమయ్యాయంటే ఇంటి దొంగలు తప్ప ఇతరులెవరికీ ఇది సాధ్యం అయ్యే పని కాదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణనకు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ (దేవాదాయ) శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాలర్ల మాయం కేసులో బాధ్యులైన 18 మందిపై ఏవిధమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వానికి తెలియజేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారికి తమను సంజాయిషీ అడిగే అధికారం లేదని వాదించి తిరిగి పదవుల్లో కొనసాగుతున్న వారిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని వారు కోరుకున్న ప్రభుత్వ కార్యదర్శే నేడు సంజాయిషీ కోరడం కొసమెరుపు.
Pages: -1- 2 News Posted: 8 July, 2009
|