పరువు తీస్తున్న కొట్లాటలు
జిల్లా కేంద్రాలలో డిఎస్ సమీక్షలు, గొడవలపై అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తాజాగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోజరిగిన సమీక్షాసమావేశంలో పార్టీ శ్రేణులు గొడవకు దిగిన తీరు పార్టీ నేతలకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. డిఎస్ వ్యూహాత్మక వైఖరే ఈ గొడవలకు దారితీస్తున్నదా అన్న అనుమానాలను వైఎస్ వర్గనేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జూన్ 13 నుంచి జిల్లా పర్యటనలు మొదలుపెట్టారు. ఒక్కోరోజు జిల్లా కేంద్రాల్లోగడిపి, పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులను పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల ద్వారా తెలుసుకోవడం, లోపాలు ఉంటే సరిదిద్ది స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడం ద్వారా పార్టీకి గుర్తింపు తీసుకురావడం, నాయకుల మధ్య ఉన్న విబేధాలను రూపుమాపడం డిఎస్ లక్ష్యం.
ఇప్పటి వరకు ఆయన విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షా సమావేశాలు పూర్తి చేసుకున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, కృష్ణా, మహబూబ్ నగర్ జిల్లా సమీక్షా సమావేశాల్లో డిఎస్ ఎదుటే పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తిట్టుకోవడం, పరస్పర ఆరోపణలతో ధూషించుకోవడం, చివరకు దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్ళింది. తాజాగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా సమావేశంలో కొడంగల్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య గొడవకు దారి తీశాయి. దీంతో సమావేశంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాయకులను సముదాయించే ప్రయత్నంలో చివరకు డిఎస్ ఒక దశలో కోపోద్రిక్తుడు కావాల్సి వచ్చింది.
వైఎస్, డిఎస్ వర్గాల నేతలు అనుసరిస్తున్న వైఖరే ఈ గొడవలకు కారణమవుతున్నట్లు కొంత మంది నేతలు విమర్శిస్తున్నారు. పార్టీలో జిల్లా స్థాయిలో నెలకొన్న వర్గాల, గ్రూపుల ఆధిపత్యపోరే ఈ గొడవలకు దారి తీస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. డిఎస్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కొంత మంది కావాలని ఇలా చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. కాగా డిఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరు వల్లే నాయకుల మధ్య గొడవలు పుట్టుకొస్తున్నట్లు వైఎస్ వర్గానికి చెందిన కొంతమంది నేతలు అనుమాన పడుతున్నారు. కాగా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు ప్రస్తుతానికి జిల్లా కేంద్రాల్లో సమీక్షా సమావేశాలు డిఎస్ నిర్వహించకుండ ఉంటేనే మంచిదని పార్టీలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Pages: -1- 2 News Posted: 9 July, 2009
|