చల్లారని ఎన్నికల సెగ
రెండోసారి ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన వైఎస్ రాజకీయంగా సంతృప్తి చెందారు. అంతేకాదు... ఈ సారి ఆయన తన అనుయాయులను తప్ప పార్టీలో వేరెవరినీ దరిచేరనివ్వడం లేదు. పార్టీలో కొత్త వారికి అవకాశాలివ్వడం లేదు. తన సొంత మనుష్యులు, అనుచరులతోనే పాలన సాగించాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం తన నాయకత్వ పటిమను నిరూపించుకోగలిగింది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు ఎన్నికలకు ముందే పార్టీని విడిచిపెట్టి ప్రజారాజ్యంలో చేరారు. అయినా గతంతో పోలిస్తే తెలుగుదేశంకు ఓట్లు పెరిగాయి. సీట్లు రెట్టింపయ్యాయి. భవిష్యత్త్ లో తామధికారంలోకి వచ్చితీరుతామన్న భరోసాను చంద్రబాబు పార్టీ శ్రేణులకు కల్పించగలిగారు. సీనియర్లు దూరం కావడంతో కొత్త వారికి తెలుగుదేశం తలుపులు తెరిచింది. ఉన్న సీనియర్లను కూడా ఈ సారి ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేయాలని టిడిపి నిర్ణయించింది.
కాంగ్రెస్ కొత్తవారికి తలుపులుమూసేసింది. దేశంలోనే వీరికి భవిష్యత్ అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశం తన సంస్థాగత యంత్రాంగాన్ని మరింత పటిష్ట పరుచుకుంటోంది. స్థానిక సంస్థలకు అధికారాలు పెరిగాయి. పాలనలో వీటి ప్రాధాన్యత అధికమైంది. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంతో పాటు స్థానిక సంస్థలపై పెత్తనం కూడా ప్రధానంగా మారింది. మున్సిపాలిటీలు, పంచాయితీలు, కార్పొరేషన్ లు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఈ సారి ఏ పార్టకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాల్లేవు. అసెంబ్లీ తరహాలో కాంగ్రెస్ ఒంటరిగానే స్థానిక పోరును ఎదుర్కొనేందుకు సిద్ధపడుతోంది. ఎమ్ ఐ ఎమ్ సహాయంతో గ్రేటర్ హైదరాబాద్ ను కాంగ్రెస్ దక్కించుకున్నా రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల్లో ఆపార్టీ పాగా వేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇతర పార్టీలు స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటే ఆ ప్రభావం రాష్ట్ర పాలనపైకూడా ప్రసరించనుంది.
ఇక క్రిందిస్థాయిలో మద్దతు కొరవడితే ప్రభుత్వానికి మరిన్ని తలనొప్పులు తప్పకపోవచ్చు. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమతమ నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ముక్కోణపుపోటీలో కొద్దిపాటి మెజార్టీతో వీరు గెలవగలిగినప్పటికీ వీరి వైఖరి మెజార్టీ ఓటర్లకు నచ్చలేదు. దీంతో స్థానిక ఎన్నికలు వీరికి జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. మరోవైపు ఈ ఎన్నికలను తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. క్రిందిస్థాయిలో అధికార పార్టీకి చెక్ పెట్టడం ద్వారా రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పధకరచన చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, జడ్ పిలలోమెజార్టీ సాధిస్తే ప్రజల్లో కూడా పార్టీ పట్ల విశ్వసనీయతం పెరుగుతుందని ఆశిస్తోంది. మరో సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు ఇది ఉపకరిస్తుందని బాబు భావిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీల భవిష్యత్ ను నిర్ధేశించనున్నాయి.
Pages: -1- 2 News Posted: 10 July, 2009
|