పాపం... చిరు!
ఎన్నికల కంటే ముందే పార్టీకి చిరంజీవి, అబిమానులు, పార్టీ జిల్లాల కన్వీనర్లు, పార్టీ అధికార ప్రతినిథి పరకాల ప్రభాకర్, పార్టీ ఉపాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి తదితర ప్రముఖులు పార్టీకి దూరం అయ్యారు. ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూసే ధోరణితో ఆగిపోయిన కొంతమంది నేతలు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ఇక వలసలను ఆపడం పార్టీ అధినేత చిరంజీవి తరం కావడం లేదు. పార్టీలో కీలక భూమిక పోషించిన డాక్టర్ వినయ్ కుమార్, ఆయన తండ్రి మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్, తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి పోటీచేసి ఓడిపోయిన వివిఎస్ చౌదరి, వేములవాడ నుంచి పోటీచేసి ఓడిపోయిన తీగల రవీందర్ గౌడ్, రాయలసీమకు చెందిన ఎం.వి రమణారెడ్డి, మాజీ మంత్రి మల్యాల రాజయ్య, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి పోటీచేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే కలమట మెహన్ రావు తదితరుల్లో కొందరు పార్టీ నుంచి నిష్క్రమించారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కూడా పార్టీకి రాజీనామా చేస్తారని సాగుతున్న ప్రచారం పార్టీలో మరింత కలవరం సృష్టిస్తోంది. దీనికి తోడు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మరో ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా ఈలి నాని తన సొంత పట్టణంలో ముఖ్యమంత్రి వైఎస్ అరవయ్యో జన్మదినోత్సవాన్ని జరపడం విశేషం. మరో వైపు హైదరాబాద్ లోని పార్టీ రెండవ కార్యాలయాన్ని కూడా తాజాగా మూసివేశారు.
పార్టీ పునాదులు కదిలిపోతున్న పరిణామాలపై పార్టీలో అధినేత తర్వాతి స్థానం కలిగిన టి. దేవేందర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం సిద్ధాంతాన్ని ప్రజలు అర్థం చేసుకోలేదు, ఇప్పుడేమో ఇది మా పార్టీలో నేలకు అర్థంగాక వారు పార్టీని వదిలిపెడుతున్నారని వ్యాఖ్యానించారు.
పార్టీ ఎదుర్కోబోతున్న పరిణామాలపై ఇటీవల దేవేందర్ గౌడ్ అధినేత చిరంజీవికే నేరుగా పరిస్థితిని విశ్లేషిస్తూ, `ప్రజారాజ్యం పార్టీ మనుగడ పూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆధారపడి ఉంది. ఈ పార్టీ ఉండటం వల్ల భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీకి లాభమేనని ఆయన భావిస్తే పార్టీ ఉంటుందని, లేనిపక్షంలో ఇది మూతపడిపోతుంది' అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారని తెలిసింది. దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయనడంలో సందేహం లేదు.
Pages: -1- 2 News Posted: 11 July, 2009
|