వరదలే దిక్కు
నేతల జలఘోషలో చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారు. వీటిని జిమ్మిక్కులుగానే భావిస్తున్నారు. అనుమతిలేని ఆనకట్టలను కేంద్రంగాని, సుప్రీంకోర్టు గాని కూల్చివేసే అవకాశాలున్నాయా అన్న సందేహం న్యాయనిపుణుల్లో కూడా తలెత్తింది. అరేబియా సముద్ర తీరంలో పుట్టిన గోదావరి, కృష్ణానదులు వందలాది కిలోమీటర్లు ప్రవహించి తూర్పు తీరంలోని బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. తమ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తున్న జలాలను కర్ణాటక, మహారాష్ట్రాలు వినియోగించుకునే అధికారం లేదా? ఆంధ్రప్రదేశ్ రైతులు, ప్రజలకోసం వారెందుకు త్యాగాలు చేయాలి? సహజ ప్రకృతిన్యాయం ప్రకారం తమకందుబాటులో ఉన్న నీటిని, గాలిని వినియోగించుకోవడం సర్వసాధారణం. మిగిలిన జలాలు ప్రకృతిసిద్ధంగా మన రాష్ట్రంలో కొస్తున్నాయి. వీటిలో మనం వినియోగించుకోగా మిగిలిన నీటిని బంగాళాఖాతంలోకి వదులుతున్నాం. దీనిపై రాష్ట్రంలోని నేతలందిరికి అవగాహన ఉంది. ఇప్పటికే నిర్మించిన, లేదా నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను బలవంతంగా తొలగించే పరిస్థితి కేంద్రానికిగాని, సుప్రీంకోర్టుకుగాని లేవు. వాటిని బాంబులుపెట్టి పేల్చేసే పరిస్థితి అంతకన్నా లేదు. ఈ ఆనకట్టలను తొలగించాలని న్యాయస్థానాలు ఆదేశించినా వాటిని అమలుచేసే యంత్రాంగం అందుబాటులో లేదు.
కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆ రాష్ట్రాల పట్లకూడా ఒకేరకమైన ధృక్పధం ఉంటుంది. అక్కడి ప్రజలూ కేంద్రప్రభుత్వ పాలితులే. తామేమీ సాధించలేమని తెలిసికూడా అధికార ప్రతిపక్షాలు జలఘోషతో ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడం సర్వసాధారణమైంది. గతంలో ఎన్ టిఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలెట్టింది. దీనికి కేంద్రప్రభుత్వం, పర్యావరణ, అటవీ శాఖలు అనుమతులు ఇవ్వలేదు. అయినా తెలుగుగంగ నిర్మాణం ఆంధ్రుల హక్కంటూ ఎన్ టిఆర్ ముందుకు సాగారు. తమ రాష్ట్రంలో ప్రహవిస్తున్న నీటిపై పూర్తి హక్కులు తమవేనని, ఇందులో కేంద్ర ప్రమేయాన్ని అంగీకరించేది లేదని తేల్చి చెప్పేశారు. ముందుకు ప్రహవించే నీటిని ఏ ఒక్కరూ ఆపలేరు. పాకిస్థాన్ లో పుట్టిన సింధు, చైనాలో ప్రారంభమైన బ్రహ్మపుత్ర నదులు భారత్ లోకి ప్రవహిస్తున్నాయి. దేశ సరిహద్దును దాటి ముందుకొస్తున్నాయి. అక్కడి నీటిని వారు, ఇక్కటి నీటిని మనం వినియోగించుకుంటున్నాం. ఈ పరిస్థితులన్నీ తెలిసి కూడా రాష్ట్ర నేతలు మరోసారి ఢిల్లీ ప్రయాణం కట్టారు. గతంలో ఇలాంటి యాత్రల ద్వారా సాధించింది శూన్యం. మొన్నటిసారైతే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Pages: -1- 2 News Posted: 20 July, 2009
|