మనదే అణుజలాంతర్గామి
అరిహాంత్ పూర్తయితే భారత్ మరో ఘనతను సాధించిన దేశంగా కూడా చరిత్ర సృష్టించబోతోంది. అదే అణ్వాయుధాలను నేల మీద నుంచి, ఆకాశం లోంచి, ఇప్పడు సముద్రగర్భం నుంచి ప్రయోగించగల శక్తిమంతమైన దేశంగా నిలుస్తోంది. మిరేజ్-2000 యుద్ధ విమానాలలో అణ్వాయుధాలను ప్రయోగించగల మిస్సైల్ లాంచర్లు ఉన్నాయి. కాని భూమిపైన, విమానాల నుంచి మొదటి మిస్సైల్ ను ప్రయోగించగానే శతృవులకు దాని ఆచూకీ సులువుగా తెలిసిపోతుంది. అదే జలాంతర్గామి నుంచి ప్రయోగిస్తే శతృ రాడార్లకు అది అంతు చిక్కదు.
అణు జలాంతర్గామిని నిర్మించాలన్న ఆలోచన 1970 సంవత్సరాల్లోనే భారత్ కు కలిగింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రతిపాదనను ఆమోదించారు కూడా. కాని 1980 దాటిన తరువాతే ఈ ప్రాజెక్టుకు ప్రాణ ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి దీని నిర్మాణం కొనసాగుతోంది. దీనికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని రష్యా అందచేసింది. నమూనా కోసం ఒక అణు జలాంతర్గామిని రష్యా లీజుకు కూడా ఇచ్చింది. 30 వేల కోట్ల రూపాయల ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. గత యేడాది మన రక్షణ మంత్రి ఎకే ఆంతోనీ మొదటి సారిగా ఎటివి నిర్మాణం చివరి దశలో ఉందని ప్రకటించి అణు జలాంతర్గామి నిర్మాణం గురించి ప్రపంచానికి తెలియజేశారు.
అరిహాంత్ లో ప్రధానంగా అణు ఆయుధాల రాకెట్లను ప్రయోగించగల లాంచింగ్ ప్యాడ్ ఉంటుంది. దీనికోసం మన శాస్త్రవేత్తలు ఈ మిస్సైల్స్ ను రూపొందించే పనిలో ఉన్నారు. ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల కె-15 మిస్సైల్ ను అరిహాంత్ నుంచి ప్రయోగించి పరీక్షించనున్నారు. అలానే ఐదువేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు అమెరికా, రష్యా, చైనాకు ఉన్నాయి. భారత్ కూడా అగ్ని-III ని అరిహాంత్ కు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖలో అరిహాంత్ నిర్మాణం జరుగుతున్నా, దీనికి రియాక్టర్ ను తయారు చేసింది కల్పక్కంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం కాగా అనేక రహస్య రక్షణ వ్యవస్థలను డిఆర్ డివో లాంటి సంస్థలు అందచేశాయి. ఇంధనం కోసం దీనిలో వాడే యురేనియంను భాభా అణు పరిశోధన కేంద్రం సమకూర్చుతుంది. అణు రియాక్టర్ల నిర్వహణ గురించి రష్యా నిపుణులు శిక్షణ ఇస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 20 July, 2009
|