కాంగ్రెస్ లో కొత్త కలవరం
వీరిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో కొందరిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే ఆరేళ్ళపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. పీసీసీ స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న కొంత మంది నాయకులపై వేటుకు పార్టీ సిద్ధమవుతున్నది. ఇలాంటి తరుణంలో వేటు పడే అవకాశాలున్న నేతలు తమ మద్ధతు దారులు, అనుచర కార్యకర్తలతో గాందీభవన్ వద్ద ధర్నాలు, ఆందోళనకు దిగుతున్నారు. తాము పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ పనిచేయలేదని, కావాలనే పార్టీ అభ్యర్థులు తమను విస్మరించి, ఎన్నికల ప్రచారానికి దూరం చేశారని, తమకు టికెట్లు రాకుండా అడ్డుకునేందుకు వారు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరైతే ఫిర్యాదులు ఇస్తున్నారో వారివల్లే పార్టీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ రాష్ట్ర నేతల ముందు వారు మొరపెట్టుకుంటున్నారు.
మరో వైపు ఇప్పటికే వేటు పడిన నేతలు, పార్టీ బహిష్కరించినా కూడా సొంత బలంపై గెలిచిన నాయకులు పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ పార్టీలో చేరేందుకు ఎవరి దారిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి వారిని పార్టీలో తీసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాల ఫిర్యాదుదారులు, పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆరేళ్ళు పార్టీ నుంచి బహిష్కరించి రెండు నెలలు తిరగకుండానే పార్టీలో చేర్చుకుంటారా? ఇది సమంజసమేనా? ఇలా అయితే ఎవరు పడితే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని, పార్టీ బహిష్కరించినా ఖాతరు చేయకుండా మళ్ళీ దొడ్డి దారిన పార్టీలో చేరుతారని ఇలాంటి చర్యల వల్ల పార్టీ క్రమశిక్షణ సన్నగిల్లే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా ప్రాంతాల కంటే గ్రేటర్ హైదరాబాద్ లోనాయకుల వైఖరితో కాంగ్రెస్ కు కష్టాలు తప్పెట్లులేవు. సనత్ నగర్, కుత్బుల్లాబూర్, సికింద్రాబాద్, శేర్ లింగంపల్లి, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, ఉప్పల్, అంబర్ పేట తదితర నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదులు భారీ సంఖ్యలోనే పీసీసీ స్ర్కీనింగ్ కమిటీకి వచ్చాయి.
Pages: -1- 2 News Posted: 23 July, 2009
|