విద్య ఉన్నతికి కమిటి
మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 4 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హులుగా కనిపిస్తున్నారని, మిగిలిన 96 శాతం మంది నాసిరకం చదువులతో బయటికి వస్తున్నారని గతంలో నాస్కామ్ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేటతెల్లం కావడంతో తేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలు వచ్చాయి, ఇక ప్రమాణాలపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైంది అన్న భావనతో ఈ కమిటీని ఏర్పాటుచేసింది. అంతర్జాతీయీకరణ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్ ముఖచిత్రం కోసం ఒక డాక్యుమెంట్ ను తయారు చేసేందుకు ఈ కమిటీని ప్రభుత్వం నియమించినట్టు పేర్కొంది. ఈ కమిటీలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి డి.లక్ష్మీపార్థసారధితో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కెసి రెడ్డి ఉంటారు. సెంట్రల్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.రామారావు, ప్రొఫెసర్ భానోజీరావు, ప్రొఫెసర్ జంథ్యాల బిజి తిలక్ కూడా సభ్యులుగా ఉంటారు.
రాష్ట్రంలో విద్యాస్వరూపంపై ఈ కమిటీ సూచనలు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఇద్దరు ఇంజనీర్లకు నలుగురు పాలిటెక్నిక్ డిప్లొమో హోల్డర్లు ఉండాలని, 10 మంది ఐటిఐ విద్యార్థులు ఉండాలని విద్యాప్రమాణాలు సూచిస్తుండగా మన రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా రివర్స్ లో ఉంది. నలుగురు ఇంజనీర్లకు ఒక్కరే పాలిటెక్నిక్ డిప్లొమో హోల్డర్ వస్తున్నారు. అసలు ఎంతమంది యుజిలోనూ, పిజీలోనూ, వృత్తివిద్యాకోర్సుల్లో ఉండాలో లక్ష్యాలను రూపొందిస్తున్నారు. అలాగే విద్యార్థులు చదువుతున్నకోర్సులు, వాటి సమయం, సందర్భం, వాటి గిరాకీ, సామాజికంగా ఆయావర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు చేరువ చేయడం వంటి అంశాలపై ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది. పాఠ్యప్రణాళికలను సమూలంగా మార్చడం, కోర్సుల పునర్వ్యవస్థీకరణ, కంటెంట్ ను అభివృద్ధి చేయడం, టీచర్లకు ట్రైనింగ్, క్లాసురూముల్లో సరైన బోధనా పద్ధతులు, విధానాలను పాటించేలా అవసరమైన చర్యలను చేపట్టడం, మొత్తంగా ఉన్నత విద్యలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను సాధించడం వంటి అంశాలను పరిశీలిస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయీకరణ చేయడం, పరిశోధనలు, వినూత్న ప్రాజెక్టులకు ప్రోత్సాహం, అందుకు అవసరమైన వ్యూహాన్ని అనుసరించడం, యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించడం, అలాగే యూనివర్శిటీలు - పరిశ్రమ మధ్య సమన్వయాన్ని సాధించడం కూడా ఈ కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. సంస్థాగత జవాబుదారీతనాన్ని సాధించడం, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ మద్దతు పొందినపుడు విద్యార్థుల ఫీజుల ఖరారు తదితర అంశాల్లో అనుసరించాల్సిన విధానాన్ని కూడా ఈ కమిటీ సూచిస్తుంది. ఈ కమిటీలో ఇండస్ట్రీ వాదన వినిపిచేందుకు వీలుగా ఇద్దరు ప్రతినిధులను కో- ఆప్ట్ చేసుకునే అవకాశం కమిటీకి ఇచ్చారు.
Pages: -1- 2 News Posted: 23 July, 2009
|