`దేశం'లో గౌడ సెగలు
దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చిన తరువాత ఆయన నాయకుల, కార్యకర్తల అభిమానాన్ని సంపాదించుకోవాలని వారు సూచిస్తున్నారు. కొంత కాలం గడిచిన తరువాత కార్యకర్తలే గౌడ్ కు సముచిత స్థానం ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి తెచ్చేలా ఆయన పనితీరు ఉండాలని అంటున్నారు. పార్టీలో చేరబోతున్న గౌడ్ కొంత కాలంపాటు ఎలాంటి పదవులను ఆశించకుండా సామాన్య కార్యకర్తగా పనిచేసి అందరి మన్ననలను పొందేందుకు ప్రయత్నించాలని వారు చెబుతున్నారు. దేవేందర్ గౌడ్ తెలుగుదేశంను వీడిన సమయంలో రంగారెడ్డి జిల్లాలో పార్టీని బతికించేందుకు ఎంతో మంది నాయకులు త్యాగాలు చేశారనీ, తిరిగి ఆయన ప్రజారాజ్యంకు గుడ్ బై చెప్పి సొంత గూటికి వస్తున్న వార్త తెలిసి ఈ జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు నిరాసతో ఉన్న మాట వాస్తవమనీ, రాజకీయ పార్టీల్లో ఇది సహజమేనని తుమ్మల అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల వైపు చూస్తూ ఎమ్మెల్యేలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుందనీ, అయితే తాము ప్రజారాజ్యంను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో 17 శాతం ఓట్లు సాధించిన ప్రజారాజ్యంకు నష్టం కలిగించడం వల్ల వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఓట్లను తమ వైపు బదలాయించుకుంటే ఎక్కువ సీట్లను పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాము అభ్యర్థిని నిలబెట్టి ఉంటే లోక్ సత్తా అభ్యర్ధి జయప్రకాశ్ నారాయణ్ గెలిచి ఉండేవారు కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ టిక్కెట్ల కేటాయింపుల్లో మెళుకువలు వహించే వారనీ, అయితే కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందనీ తుమ్మల చెప్పారు. పార్టీలు మారి సొంత గూటికి చేరిన నాయకులకు వెనువెంటనే పార్టీలో కీలక పదవుల్లో నియమించడం ససాంప్రదాయం కాదని అన్నారు. దేవేందర్ గౌడ్ తెలుగుదేశంలో చేరకమునుపే ఆయనకు రాజ్యసభ ఇస్తారని హామీ ఇవ్వడం, పొలిట్ బ్యూరోలో తీసుకుంటారని చెప్పడం వంటి వార్తలు పత్రికల్లో వస్తున్నాయనీ, ఇటువంటి వార్తలు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఇబ్బంది పెడతాయని ఆయన చెప్పారు.
Pages: -1- 2 News Posted: 1 August, 2009
|