వైఎస్ - బాబు ఒకటే దారి
తెరాసను నామమాత్రం చేయడంతోపాటు ప్రతిపక్షం తెలుగుదేశం ఎదుగుదలను కట్టడి చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న తెరాస నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి, కెకే మహేంద్రరెడ్డి, సుహాసినీ రెడ్డి, నీలపద్మలకు ఘన స్వాగతం లభించింది. తెరాస ఎంపీ విజయశాంతి పైన కూడా కాంగ్రెస్ 'ఆకర్షణ' ప్రభావం చూపించిందని సమాచారం. ఇంకా కొంత మంది కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు రావడం తెరాస శ్రేణుల్లో మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నికల తరువాత తెరాస అధినేత కేసీఆర్ పై పలువురు నాయకులు తిరుగుబాటు చేయడం దిలీప్ కుమార్ వంటి నేతలు మరో ఉద్యమ సంస్థ 'తె.వి.స'ను స్థాపించడం వంటి అంశాలు వైఎస్ 'ఆశలకు' ఊపిర్లు ఊదాయి.
మరోవైపు అధికారం తమదేనని 'తలుపుల పల్లకీ'ల్లో ఊరేగిన తెలుగుదేశం కూడా ఓటమిని సమీక్షించింది. తమ విజయావాకాశాలకు 'గండి'కొట్టిన పార్టీలు... లోక్ సత్తా, ప్రజారాజ్యంగా గుర్తించింది. ఇలా అయిందేమిటి చెప్మా? అని ఆ పార్టీ శ్రేణులు నిర్ఘాంత పోయిన స్థితిలో కాంగ్రెస్ ఆకర్షణ మొదలైంది. దీన్ని తట్టుకొని 2014 ఎన్నికల్లో 'సత్ఫలితాలు' పొందాలంటే 'సహ' పక్షాలు బలహీనం కావడమే శరణ్యమని తేదాపా వర్గాలు భావించాయి. దీనికి తోడు అధికారంలోకి వచ్చేది 'ప్రజారాజ్యమే'నని భావించి ఆ పార్టీలోకి పరుగులు తీసిన మాజీ తెలుగుదేశం నేతల్లో అంతర్మధనం మొదలైంది. ప్రజారాజ్యానికి అందలం దక్కని స్థితిలో... ఆ పార్టీలో కొనసాగుతున్న పరిణామాల పట్ల వారు కలవరపడ్డారు. ఈ తీరుగా ఐదేళ్ళు ప్రతిపక్షంగా ఉనికిని చాటుకోవడం కష్టమని వారు భావించారు.
తేదేపా నుంచి ప్రజారాజ్యానికి వెళ్ళినవారిలో ఎక్కువ మంది ఎన్నికల్లో ఓడిపోయారు. తేదాపాలో నెంబర్ టూగా వెలిగిన తూళ్ళ దేవేందర్ గౌడ్ అయితే రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఆయన పరిస్థితి 'మడుగు వదిలిన మొసలి' లాగా తయారయింది. దీంతో బలమైన పార్టీనీడన ఉంటేనే తమకూ బలం, బలగం ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలు గుర్తించాయి. ఈ కారణంగానే దేవేందర్ గౌడ్ తో పాటు పార్టీ మారిన పెద్దరెడ్డి గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున అభ్యర్థులుగా పోటీ చేసిన కొందరు ఈనెల ఆరున తెలుగుదేశం చేరనున్నారు. దీంతో తెలుగుదేశాన్ని వీడిన మిగిలిన మాజీలు యలమంచిలి శివాజీ, తమ్మినేని సీతారాం, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితర నేతలకు 'స్వగృహ' పధకం వర్తించే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజారాజ్యం బలహీనమైతే ఆ పార్టీ ఓటు బ్యాంకుల్లో సింహ భాగం తమదేకాగలదని తెలుగుదేశం అంచనా వేస్తోంది. లోక్ సత్తాకు లభించిన ఓట్ల కారణంగా కనీసం తమ అభ్యర్థులు ఓడారని భావిస్తున్న తెలుగుదేశం ఆ పార్టీ పట్ల స్నేహంగా ఉండే అవకాశాలు తక్కువే. లోక్ సత్తా పై ఇటీవల తెలుగుదేశం చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం.
అదే విధంగా కాంగ్రెస్ కూడా ముందుగా తెరాసపైన తన ఆకర్షణను ప్రయోగించింది. ప్రజారాజ్యం వల్ల తమకు తక్షణమే రాగల ముప్పేమీ లేదని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. నిజానికి ప్రజరాజ్యం శాసనసభ్యుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ తో సాన్నిహిత్యాన్ని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తమ నియోజకవర్గాల్లో పనులు చేయించాలంటే అధికార పక్షం అండదడలు కావాలని వారు భావిస్తున్నారట. ఏది ఏమైనా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసాక కూడా ఇంకా అదే జోరు కొనసాగడం మాత్రం ఇదే ప్రదమం. వచ్చే 'దీర్ఘకాల' ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని ఒక నాటి ఇద్దరు 'మిత్రులు' - వైఎస్, చంద్రబాబులు కొన్ని పార్టీల 'అంతు' చూస్తున్నారు!
Pages: -1- 2 News Posted: 4 August, 2009
|