కాంగ్రెస్ కు 'ఫుడ్ ప్రాబ్లం'! భారత్ అవసరాలను తీర్చడానికి ఏటా 180 లక్షల టన్నుల అపరాలు అవసరం. గత ఏడాది మధ్యభారత్ లో తక్కువ వర్షపాతంతో 34 లక్షల టన్నుల అపరాల దిగుబడి తగ్గింది. ఈ ఏడాది అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో రాజీవ్ గాంధీ హయాంలో ఆయిల్ సీడ్స్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు ద్వారా సంక్షోభం నుంచి గట్టెక్కిన విధానాన్ని మరోసారి కాంగ్రెస్ అమలు చేయనుంది. 1980 దశకంలో టెక్నాలజీ మిషన్ వల్ల కరవుప్రాంతంలో ఉత్పాదకత 85 శాతం పెరిగింది. తరువాత కాలంలో ఇది 30 శాతానికి తగ్గింది! ఈ నేపథ్యంలో 'ప్రభుత్వం అపరాలు, చెరకు ఉత్పత్తి పెంచేందుకు రాజీవ్ టెక్నాలజీ మిషన్ తరహాలో కృషి చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది పేర్కొన్నారు.
దేశంలో అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు రానున్న పండుగల వాతావరణాన్ని భంగం చేస్తుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. దానికి తోడుగా ఈఏడాది మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మంత్రులు పారిశ్రామిక వేత్తలతో చెట్టపట్టాలు వేసుకోవడం మాని, పేదరికం నిర్మూలనకు ప్రయత్నించాలని కాంగ్రస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అంబానీ సోదరుల వివాదం, పెట్రోలియం శాఖ వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ధరల పెరుగుదల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2006లో వలె మరోసారి స్పందిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పప్పుదినుసులు 2006లో కిలో రూ.40 పలకగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరచిన సోనియాగాంధీ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిలో కందిపప్పు రూ.90కి చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని, వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి ధరల నియంత్రణకు సోనియా పూనుకుంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Pages: -1- 2 News Posted: 11 August, 2009
|