ఇంతకీ ఈ ముగ్గిరిలో ఎవరికోరికను ఆ కనిపించని భగవంతుడు తీరుస్తాడో చూడాలి మరి. రాష్ట్రంలో వానలు పడటానికి కారణం 'వానదేవుడు' తమ పార్టీలో ఉన్నారని ఇన్నాళ్ళూ చెప్పే కాంగ్రెస్ నాయకులకు కరవు దెబ్బకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వరుణదేవుడు వైఎస్ అధర్మపాలన చూసి 'అసమ్మతి' వర్గంలో చేరారని ప్రతిపక్షాలు చమత్కరిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత విదేశాల్లో పర్యటించి తిరిగి వచ్చేటప్పటికి రాష్ట్రంలో వాన ముసురు పట్టింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ మాట్లాడుతూ 'అంతా దేవుడి దయ' అన్నారు. కాగా ప్రతిపక్షాలు వానలు కురవాలని కోరుకోవడం లేదని కూడా అధికార పక్షం ఆరోపిస్తోంది. నిజం వాన దేవుడి కెరుక!
తెలంగాణ ఎప్పుడొస్తుందంటే... దేవుడు దయతలిస్తే తెలంగాణ వస్తుందని మాజీ తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి జోస్యం చెప్పారు. 'దేవుళ్ళ వేషాలు వేసి ప్రజల గుండెల్లో 'కలియుగ దైవం'లా నిలిచిన 'అన్న' ఎన్టీఆర్ మాత్రం 'సమాజమే దేవాలయం.... ప్రజలే నా దేవుళ్ళు' అని అనేక సందర్భాల్లో చెప్పారు! ఇది గతించిన చరిత్ర... తమది 'దేవుడి పాలన' అని ప్రస్తుత పాలకులు ఏమాత్రం తొణక్కుండా చెబుతున్నారు. ఇది వర్తమానం. ప్రస్తుతం దేవుళ్ళను ఏకంగా పార్టీల్లో చేర్చుకునే కాలం వచ్చాక.... ప్రజలు ఏమైపోతేనేం? పదవులు పదిలమైతే చాలు! అదే పదివేలు!