శివమెత్తిన చిరు! హైదరాబాద్ : చిరంజీవి ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రజారాజ్యం పార్టీపై రెండు పత్రికల్లో వస్తున్న కథనాలపై ఆయన విరుచుకుపడ్డారు. 'ఎవరి జండాలు ఎవరు పీకుతారో సాయంత్రం లోగా తేలుస్తానం'టు అనూహ్య రీతిలో ఎదురుదాడికి దిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఈ మెగాస్టార్ ఎప్పుడూ సౌమ్యంగానే వ్యవహరించారు. కానీ గురువారం మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. 'జెండా పీకేద్దాం!' అంటూ ఈనాడు పత్రికలోను, 'మాజీల కంటే తాజాలకే ప్రాధాన్యం' అంటూ ఆంధ్రజ్యోతి దిన పత్రికల్లో గురువారం వచ్చిన వార్తా కథనాలపై చిరంజీవి తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం అవుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి గురువారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆ రెండు పత్రికల ధోరణిపైనా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తమ పార్టీపై అసత్యాలు, అభూతకల్పనలు రాస్తున్నాయని నిప్పులు చెరిగారు. ప్రజారాజ్యం పార్టీని బలహీన పరిచేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కుట్రపన్నాయని ఆరోపించారు. గత రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో తాము బుధవారం రాత్రి సమావేశం అయిన మాట నిజమే అని పిఆర్పీ ఎమ్మెల్యే వంగా గీత తెలిపారు. పత్రికల్లో తమ సమవేశంపైన ఊహించి ఊహాగానాలతో అవాస్తవాలు రాస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం అవుతున్నట్లు పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవమూ లేదని మరో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఖండించారు. అల్లు అరవింద్ నివాసంలో తాము సమావేశమైన విషయం వాస్తవమే అని కాంగ్రెస్ పార్టీలో పిఆర్పీ విలీనం గురించి చర్చించలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఖండించారు.
కాగా, ప్రజారాజ్యం పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాలో ఈనాడు దినపత్రికలను గురువారం మధ్యాహ్నం ప్రజారాజ్య పార్టీ కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు దగ్ధం చేశారు. మరో పక్కన సోమాజిగూడలో ఉన్న ఈనాడు పత్రిక కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు ప్రజారాజ్యం పార్టీ క్యాడర్ సన్నాహాలు చేస్తోంది. దీనితో ముందు జాగ్రత్త చర్యగా ఈనాడు కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.
Pages: 1 -2- News Posted: 20 August, 2009
|