పీఆర్పీనీ 'అల్లు'కున్న వివాదం! గతంలో 'చంటబ్బాయ్' సినిమాలో హాస్యపాత్రలో నటించిన అల్లు అరవింద్ తన స్వామి భక్తి, కొంటె చేష్టలతో చిరంజీవికి అడుగడుగునా ఇబ్బందులు, ఆటంకాలు కల్పిస్తూనే ఉంటాడు. అలాగే ఆయన ప్రజారాజ్యంలో వస్తున్న వివాదాల్లో తొలి నుంచీ కేంద్ర బిందువుగానే ఉంటున్నారు. బావమరిది చిరంజీవికి అండగా నిలబడేందుకు బావ అల్లు చేసిన ప్రతి ప్రయత్నం వివాదంగానే మారడం గమనార్హం. ఎన్నికల పూర్వం - పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో అల్లు సహకరిస్తే 'వసూళ్ళు' చేశారన్న ఆరోపణలు వెంటాడాయి. తాజాగా పార్టీ శాసనసభ సభ్యులకు బుధవారం రాత్రి ఇచ్చిన విందు కూడా పత్రికలకు 'కంటగింపు'గా మారింది. దీంతో ఆవేదన చెందిన అల్లు 'పార్టీ శాసనసభ్యులకు భోజనం పెట్టడం కూడా తప్పేనా' అంటూ భారంగా నిట్టూర్పు విడిచారు.
శాసనసభ్యులతో 'పిచ్చాపాటి' మాట్లాడిన అల్లు ఇచ్చిన 'విందు' నేపథ్యంలో 'జెండా పీకేద్దాం' అన్న శీర్షికతో ఈనాడు ప్రచురించిన వార్త రాష్ట్రంలో సంచలనాలకు కారణమైంది. పీఆర్పీ ఎంఎల్ ఏలు కాంగ్రెస్ లో కలిసేది లేదని, ఇదంతా కుట్రేనని వీరంగం వేశారు. అలాగే చిరంజీవి కూడా 'ఆ రెండు' పత్రికల కోసం మా పార్టీని మూసేస్తామా అని నిలదీశారు. ఈనాడులో ఉద్యోగాలు కోల్పోయి కొందరు వెళ్ళిపోతే పత్రికను మూసేశారా అని కూడా సూటిగా ప్రశ్నించారు. బాగుంది ప్రజారాజ్యం పార్టీ తెలుగునాటి రాజకీయ రంగంలో వర్ధిల్లాలని చిరంజీవి, ఆయన సన్నిహితులు కోరుకోవడం సంతోషమే.
కానీ 'విందు'తో పాఠక జనానికి 'పసందైన వార్తల'కు అవకాశమిచ్చిన అల్లు మాత్రం 'కాంగ్రెస్ లో చేరడం ఏమిటి' అని ప్రశ్నించలేదు, ఖండించనూ లేదు. నిజానికి పీఆర్పీ ఎంఎల్ ఏలు అందరూ అరవింద్ ను కలవలేదు. కేవలం ఆరుగురు శాసనసభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. అప్పటికే కొంతమంది శాసనసభ్యులు కాంగ్రెస్ లోకి చేరుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఈ సందర్భంగా తాము పార్టీ అంతర్గత విషయాలే చర్చించామని శాసనసభ్యులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో కలవడం ఏమిటని ఘంటాపథంగా వారు ప్రశ్నిస్తున్నారు. నిజం ఏమిటనేది నిలకడగా తేలుతుంది. కానీ, ఎన్నికల సమయంలోనూ, తరువాత అల్లు కేంద్రంగా వివాదాలు ఉత్పన్నమయ్యాయి. వివాదాలను ఎదుర్కోవలసి వచ్చింది మాత్రం ... చిరంజీవే!
Pages: -1- 2 News Posted: 21 August, 2009
|