పాక్ వెళ్ళనున్న జశ్వంత్
ఇస్లామాబాద్ లో కార్యక్రమం అనంతరం జశ్వంత్ సింగ్ కరాచిలో అటువంటి కార్యక్రమానికే హాజరు కావలసి ఉంది. అక్కడ కూడా ఆయన గ్రంథానికి గణనీయమైన స్పందన లభిస్తోంది. 'ఆయన బస కోసం మేము మా షాపులో భద్రతతో సహా చాలా ఏర్పాట్లు చేశాం. ఆయన రాగలరనే ఆశిస్తున్నాం' అని యూసుఫ్ చెప్పారు. 'నేను ఈ వ్యాపారంలో 30 ఏళ్ళుగా ఉన్నాను. కాని ఇటువంటి చెప్పుకోదగిన స్పందన మాకు లభించడం మాత్రం ఇదే మొదటిసారి. మాకు సోమవారం 165 కాపీలు వచ్చాయి. అవి మూడు గంటల్లోనే అమ్ముడుపోయాయి. మరిన్న కాపీల కోసం మేము పబ్లిషర్ కు విజ్ఞప్తి చేశాం' అని యూసుఫ్ తెలియజేశారు.
ఇస్లామాబాద్ లో ఈ గ్రంథాన్ని రూ. 1500 రేటుకు అమ్ముతున్నారు. దీనికి అధిక ధర నిర్ణయించినప్పటికీ డిమాండ్ పెరుగుతున్నదని, దీనిలోని అంశాలపై పాకిస్తాన్ లోని ప్రధాన స్రవంతి వార్తాపత్రికలు, వార్తా చానెల్స్ వ్యాఖ్యలు చేస్తుండడమే ఇందుకు కారణమని యూసుఫ్ చెప్పారు. 'ఆటోగ్రాఫ్ ల కార్యక్రమం కోసం మేము 500 కాపీలను ప్రత్యేకించాం. జనం ధర గురించి బాధ పడడం లేదు. ఆ 500 కాపీలు కూడా స్వల్ప వ్యవధిలోనే అమ్ముడుపోగలవని నా నమ్మకం' అని ఆయన చెప్పారు.
ఇండియాలో విడుదల చేసిన కొద్ది సేపటికే ఈ గ్రంథం పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలలో అమ్మకానికి వచ్చింది. దీనిన ఇండియా నుంచి నేరుగా లేదా దుబాయి మీదుగా తెప్పించుకుంటున్నారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ పంపిన ఒక కాపీ నుంచి విదేశాంగ శాఖలో అధికారులు ఫోటో కాపీలు తీయించినట్లు తెలుస్తున్నది. జిన్నాపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు జశ్వంత్ ఇండియాలో బిజెపి నుంచి, ఇతరుల నుంచి విమర్శలను ఎదుర్కోగా పాకిస్తానీ మీడియా మాత్రం ఆయనను ఘనంగా పొగుడుతున్నది.
ప్రముఖ 'డాన్' పత్రిక తన సంపాదకీయంలో జశ్వంత్ సింగ్ ధైర్యాన్ని శ్లాఘిస్తూ, 'ఇక్కడ పాకిస్తాన్ లో భారతీయ స్వాతంత్ర్యోద్యమ నేతలపై అటువంటి వ్యాఖ్యలను ఊహించగలమా అనే ముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తున్నది. జశ్వంత్ సింగ్ పట్ల దారుణంగా వ్యవహరించారు' అని పేర్కొన్నది.
Pages: -1- 2 News Posted: 26 August, 2009
|