హోంమంత్రే గాలింపు కమాండర్
ఈ అయోమయాన్ని చిదంబరం నిరోధించారు. ఆయనే వ్యక్తిగతంగా గాలింపు ఆపరేషన్ కు నాయకత్వం వహించారు. కేంద్రానికి వైఎస్ జాడ తెలియడం లేదన్న సమాచారమే కనీసం మూడు గంటలు ఆలస్యంగా చేరింది. చిదంబరం తాను ముందస్తుగా నిర్ణయించుకున్న అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆ క్షణం నుంచి గురువారం వైఎస్ మృతదేహాన్ని హైదరాబాద్ కు చేర్చే వరకూ సివిలియన్, మిలటరీ అధికారులు నిర్విరామంగా పనిచేశారు. దేశ చరిత్రలోనే అరుదైన గాలింపు ప్రక్రియ నిలచిపోయిన ఈ ఆపరేషన్ మొత్తం స్థిరంగా, నిశ్శబ్దంగా, నియంత్రణతో వైఎస్ జాడ కనిపెట్టే లక్ష్యం వైపు సాగిపోయింది. హోం మంత్రి చిదంబరం తన కార్యలయంలోని వార్ రూంలోనే కూర్చున్నారు. యుద్ధరంగంలో ఫీల్డ్ కమాండర్ లానే పనిచేశారు. కనీసం ఆరు గంటల సేపు చిదంబరం వార్ రూంలోనే ఉండి నల్లమల అడవుల చిత్రపటాలను విశ్లేషిస్తూ ఆపరేషన్లో ఉన్న అధికారులకు మార్గనిర్ధేశం చేస్తూ, ఆదేశాలు ఇస్తూ చివరకు హెలికాప్టర్ ఆచూకీ ని కనిపెట్టగలిగారు.
కేంద్రానికి సమాచారం ఆలస్యంగా చేరడంతో అసలు వాస్తవ పరిస్థితిని అంచనా వేసి రంగంలోకి దిగే సరికి చీకటిపడే సమయం దగ్గరపడిపోయింది. ఏమైనా గాని గాలింపు ఆపకూడదని నిర్ణయించుకున్న చిదంబరం వెంటనే పౌర విమానయాన శాఖను, రక్షణ శాఖను, విదేశీ వ్యవహారాల శాఖను కూడా సమన్వం చేసి వాటిని కూడా రంగంలోకి దింపారు. దాని ఫలితమే అమెరికా ఉపగ్రహాల సహాయం కోరడం, సుఖోయ్ విమానాలను పంపడం, ఇస్రో సేవలను వినియోగించుకోవడం సాధ్యమైంది. నల్లమల అడవుల్లో గాలింపు కోసం కమెడోర్ సాగర్ భారతిని నియమించడం ద్వారా మొత్తం గాలింపు కార్యక్రమాన్ని చిదంబరం తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు మాత్రమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య అవగాహన సాధ్యమైంది.
హోం మంత్రి చిదంబరం వార్ రూం నుంచి ఆదేశాలతో అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేశాయి. 400 మంది అటవీ శాఖ సిబ్బంది, ఐదొందల మంది కూలీలు, 300 మంది గిరిజనులు, ఆరు కంపెనీల సిఆర్పిఎఫ్, ఐదు వందల మంది మద్రాస్ రెజిమెంట్, గూర్ఖా రెజిమెంట్ సైనికులు, తొమ్మిది బృందాల గ్రేహౌండ్ పోలీసులు, మూడు సుఖోయ్ విమానాలు, హెలికాప్టర్లు, సాంకేతిక బృందాలు లక్ష్యాన్ని నెరవేర్చాయి.
Pages: -1- 2 News Posted: 4 September, 2009
|