ముఠాల చిచ్చు రగిలేనా? ఈ క్రమంలో 2004లో ఎన్నికలు గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ మాటకు పార్టీ అధిష్టానం విలువనిచ్చింది. అలాగే 2009 ఎన్నికల్లో 'చెప్పింది చేసి చూపిన' ఆయనను 'రోల్ మోడల్' ముఖ్యమంత్రిగా గుర్తించింది. అందుకనే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అసమ్మతి స్వరం వినిపించిన నాయకులను మంత్రి వర్గంలోకి తీసుకోకపోయినా అధిష్టానం సరే అంది. 2004-2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ నాయకత్వంలో సాధించిన ఎంపీల స్థానాలే కారణమన్న విషయం సోనియా, మన్మోహన్ లకు తెలుసు.
ఇదే విషయాన్ని ఒక రాజకీయ విశ్లేషకుడు ప్రస్తావిస్తూ 'రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి నియంత్రణకు అధిష్టానం వైఎస్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఆయన మృతి అనంతరం ఆ పరిస్థితి కొనసాగక పోవచ్చు' అని అంచనా వేశారు. రాష్ట్ర శాసనసభలో మొత్తం 294 స్థానాల్లో కాంగ్రెస్ కు 156, దాని మిత్ర పక్షం మజ్లీస్ కు 7 స్థానాలు ఉన్నాయి. ఈ కారణంగా సంక్షోభాలు నెలకొనే అవకాశం ఉంది. అయితే ఇవి సమీప భవిష్యత్తులో ఎన్నికలకు దారీ తీయవని అంచనా వేస్తున్నారు. పార్టీలో తిరిగి తలెత్తే అసమ్మతి ధోరణులను వైఎస్ వారసునిగా వచ్చే ముఖ్యమంత్రి నియంత్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తాత్కాలిక ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
వైఎస్ స్థానంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి వర్గ సభ్యులు తీర్మానించారు. మెజారిటీ శాసనసభ్యుల సంతకాలు సేకరించారు. కొంతమంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే అవకాశం ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో వారు బయటపడకపోవచ్చు. త్వరలో సీఎల్పీ సమావేశాన్ని అధిష్టానం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. మరో వైపున జగన్ తో పాటు కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, పురంధరేశ్వరి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ల పేర్లు కాగాల ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో వైఎస్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి అసమ్మతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైఎస్ ప్రభుత్వం ప్రారంభించిన జలయజ్ఞనం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, ఉపాధి హామీ తదితర పథకాలను ప్రజలకు లబ్ధి కలిగేలా కొనసాగించాలి. 2014 ఎన్నికల నాటికి అండగా ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలి. ఇంతటి గురుతర బాధ్యతల నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చినా అది కత్తి మీద సామే కాగలదు.
Pages: -1- 2 News Posted: 4 September, 2009
|