స్నేహానికి సెలవా? ముఖ్యమంత్రి వైఎస్ పర్యటిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ తెలియడం లేదన్న విషయం తెలియగానే డాక్టర్ కెవిపి బుధవారం ఉదయం నుంచి రాత్రి రెండు గంటల వరకు సచివాలయంలోనే ఉండి, నిద్రాహారాలు మాని అనుక్షణం తన ఆప్త మిత్రుని జాడ తెలుసుకునేందుకు పరితపించారు. అయితే కలలోనైనా ఊహించని విషాద వార్త డాక్టర్ కెవిపి గురువారం ఉదయం వినాల్సి వచ్చింది. కనీసం తన మిత్రున్ని కడసారి కళ్ళారా చూసే అవకాశం లేకుండా హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మాంసం ముద్దయ్యారు. 1989-1994 మధ్య కాలంలో వైఎస్ అసమ్మతి రాజకీయాలు నడిపినా, 2003లో పధ్నాలుగు వందల కిలోమీటర్ల పాదయత్ర చేసినా, వైఎస్ వేసే ప్రతి అడుగు వెనుక ఉండేది కేవిపియే. మండుటెండలో వైఎస్ పాద యాత్ర చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు 'నడిచేది వైఎస్, నడిపించేది రామచంద్రుడు' అని వ్యాఖ్యానించారు. కలహాలు, కల్మషం లేని స్నేహానికి వైఎస్, కెవిపి ప్రతీకలు. తన జీవితంలో వైఎస్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది కెవిపి కోరికైతే, తన జీవిత కాలంలో కెవిపిని రాజ్యసభ సభ్యునిగా చూడాలన్నది వైఎస్ కోరిక. వారిద్దరి కోరిక నెరవేరింది. వారి స్నేహ జీవితంలో మరచిపోలేని, మరపురాని తీపి గురుతుగా అది నిలిచి పోతుంది. వైఎస్ ఉన్నంత వరకు ఆయన ఆత్మ కెవిపి. ఇప్పుడు కెవిపి ఆత్మగా వైఎస్ ఆయన్ను నడిపిస్తారు. భౌతికంగా వారి శరీరాలు వేరైనా, వారి స్నేహాన్ని ఎవరూ వేరు చేయలేరు.
అలానే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనకాలే ఎప్పుడూ తెల్లటి జుట్టుతో కనిపిస్తూ ఉండే వ్యక్తి ఎవరు? ఇది చాలా మంది లో మెదిలే ప్రశ్న. మఫ్టీలో ఉండే అంగరక్షకుడు (పోలీసు) అని, కాదు పర్సనల్ అసిస్టెంట్ అని ఇలా రకరకాలుగా ఊహిస్తుంటారు. ఇంతకూ ఎవరీ వ్యక్తి. ఆయన సూర్యనారాయణ, కానీ అందరూ 'సూరీడు' అని పిలుస్తారు. ఈ సూరీడు వైఎస్ కు అత్యంత నమ్మిన బంటు. వైఎస్ ఇంటి నుంచి బయటకు రాగానే వెన్నంటి ఉంటాడు. వైఎస్ దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కూడా వెంట తీసుకువేళ్ళేవారు. కాగా ఈ నెల 2న వైఎస్ హెలికాప్టర్ లో చిత్తూరు పర్యటనకు బయలుదేరినప్పుడు కూడా సూరీడు వెళ్ళాలనుకున్నా, హెలికాప్టర్ లో స్థలం లేదని చెప్పడంతో హైదరాబాద్ లోనే ఉండిపోయారు. సూరీడు వైఎస్ కు అంతగా నమ్మకంగా ఎలా కాగలిగారంటే, సూరీడు కుటుంబం వైఎస్.రాజారెడ్డి హయాం నుంచే అనుచరులుగా ఉంటున్నారు. నమ్మకస్తుడైన సూరీడును ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని వైఎస్ తల్లి జయమ్మ సూచించింది. దీంతో సుమారు పాతికేళ్ళుగా వైఎస్ ఎప్పుడూ సూరీడును తన వెంటే ఉంచుకుంటున్నారు.
Pages: -1- 2 News Posted: 4 September, 2009
|