యుజిసి 'డీమ్డ్' పొరబాట్లు
డీమ్డ్ యూనివర్శిటీలపై ప్రభుత్వ భవిష్యత్తు విధానాన్ని కూడా ఈ నివేదిక ఆధారంగా రూపొందించవచ్చు. డిగ్రీలను ఇచ్చే విధంగా ఉన్నత స్థాయి విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇంతకుముందు అనుసరించిన విధానం వల్ల ప్రోత్సాహం లభించింది. కాని అవినీతికి పాల్పడడం ద్వారా విద్యా ప్రమాణాలను తగ్గించారనే ఆరోపణలు ఆతరువాత వచ్చాయి. ఏ విద్యా సంస్థకైనా ఒకసారి డీమ్డ్ యూనివర్శిటీ హోదా మంజూరైతే ప్రొఫెషనల్ కోర్సులు ఆఫర్ చేసే అనుబంధ కాలేజీలు డిగ్రీలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా గుర్తింపు పొందవలసిన ఆవశ్యకత ఉండదని సుప్రీం కోర్టు ఒక తీర్పులో స్పష్టం చేసింది. తమిళ కవి భారతీదాసన్ పేరిట ఏర్పాటైన ఒక డీమ్డ్ యూనివర్శిటీ దాఖలు చేసిన ఒక కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పును అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ), యుజిసి తప్పుగా అన్వయించుకున్నాయని సమీక్ష పేర్కొన్నది.
ప్రభుత్వ ఆమోదం లేకుండానే దేశంలోను, విదేశాలలోను కొత్త కాంపస్ ల ఏర్పాటుకై డీమ్డ్ యూనివర్శిటీలకు అనుమతి ఇచ్చినప్పుడు ఎఐసిటిఇ, యుజిసి ఈ తీర్పును ఉటంకించాయి. 'తీర్పును సరిగ్గా అన్వయించుకోలేదనే అభిప్రాయం ఉంది. డీమ్డ్ యూనివర్శిటీ హోదా మంజూరైన సమయంలో ఉన్న అనుబంధ కాలేజీలకు వర్తించే నిబంధనలు స్క్రూటినీ నుంచి కొత్త కాంపస్ లు లేదా కాలేజీలను మినహాయించజాలవు' అని హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ సమీక్ష బృందంలోని సభ్యుడు ఒకరు వాదించారు. కొత్తగా ఏర్పాటైన విద్యా సంస్థల యోగ్యతలు ధ్రువీకరణ కాకముందే వాటికి యుజిసి డీమ్డ్ యూనివర్శిటీ ప్రతిపత్తి మంజూరు చేయడంలో ఔచిత్యం లేదని సమీక్ష బృందం అభిప్రాయపడినట్లు ఆ సభ్యుడు పేరు వెల్లడి చేయరాదనే షరతుపై ఒక పత్రిక విలేఖరితో చెప్పారు.
పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టం కింద ఏర్పాటైన కేంద్ర విశ్వవిద్యాలయాలు లేదా ఐఐటిలు లేదా యుజిసి గుర్తించిన డీమ్డ్-టు-బి- యూనివర్శిటీలు వంటి విద్యా సంస్థలు మాత్రమే దేశంలో డిగ్రీలను ప్రదానం చేయగలవు. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ వంటి ప్రసిద్ధ ఉన్నత విద్యా సంస్థలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోకుండా డిగ్రీలు ప్రదానం చేయగలిగే విధంగా డీమ్డ్ యూనివర్శిటీ ప్రతిపత్తి మంజూరు చేయాలనే సూత్రాన్ని మొదట సర్వేపల్లి రాధాకృష్ణన్ సూచించారు.
Pages: -1- 2 News Posted: 14 September, 2009
|