ప్రభుత్వం పడకేసింది ఇలా ఉండగా, ఆర్థిక శాఖ వంటి కొన్ని ప్రధాన శాఖల అధికారులు తప్ప మిగిలిన శాఖలో ఫైళ్ల కదలికలు తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. గతంలో రోజుకు 250 నుండి 300 వరకు జీవోలు వచ్చే పరిస్థితి ఉండగా, ఈ పదిరోజుల్లో 150 ఉత్తర్వులు రావడమే గగనమైపోయింది. అవి కూడా సాధారణ విధులకు సంబంధించినవే తప్ప ముఖ్యమైనవి దాదాపు లేవనే అంటున్నారు. రాష్ట్రంలో వ్యాధులు, నిత్యావసర వస్తువుల కొరత, ధరల పెరుగుదల, కరవు కాటకాల వంటి అనేక ప్రధాన సమస్యలు వేధిస్తున్న నేపధ్యంలో తాత్కాలికంగా పట్టువిడుపులు మాని పాలనలో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొంతమంది అధికారులు అంటున్నారు.
రోశయ్యను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంగీకరించే స్థితి కనిపించడం లేదు. దాంతో చివరకు అధికారులు సైతం ఎవరి మాట వింటే ఏ సమస్య వస్తుందో అని ఏ పనీ చేయకుండా ఉండిపోతున్నారని, ఎక్కువ కాలం ఇలాంటి పరిస్థితిని కొనసాగించడం రాష్ట్రానికి మంచిది కాదనీ, ఒకవేళ రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించదలిస్తే అదే విషయాన్ని ప్రకటిస్తే బాగుంటుందని, అప్పుడు అధికారులు ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధమవుతారని తెలుగుదేశం నాయకులు సూచిస్తున్నారు. క్రాప్ హాలిడేస్ ప్రకటించినట్లుగా రాష్ట్రంలో పాలనా హాలిడేస్ ప్రకటించినట్టుగా ఉందని టిడిపి నాయకులు విమర్శిస్తున్తనారు.
స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదని తెలుగుదేశం మాజీ మంత్రులు కోడెల శివప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి, టిడిపి ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుగుదేశం విమర్శిస్తోంది. చివరకు మంత్రుల పరిస్థితి సైతం ఇబ్బంది కరంగా మారింది. ఒకవైపు రోశయ్య మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతూ మరోవైపు జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ డిమాండ్ చేస్తున్న మంత్రులు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
Pages: -1- 2 News Posted: 16 September, 2009
|