రోశయ్యంటే లోకువా! ఇదే వైఎస్ పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు ఇలా 'ఫోజు'లిచ్చేవారా? అని గురువారం నాటి వీడియో కాన్ఫరెన్స్ చూసినవారికి అనిపించక మానదు. 'స్వైన్ ఫ్లూ' అంతు చూసే వరకు ప్రభుత్వం నిద్రపోదని ముఖ్యమంత్రి రోశయ్య చెబుతున్న సమయంలోనే ఆయన పక్కన కూర్చున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి 'కునుకు' తీస్తున్నారు. ఇదంతా చూస్తుంటే... రోశయ్యకు కూడా తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదని... అనుమానం వచ్చినట్టుంది! తననింకా ఆర్థికమంత్రిగా, భావించుకుంటూ తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారని రోశయ్య ఒకటి రెండు సందర్భాల్లో పేర్కొనడం కొసమెరుపు. తరువాత 'మాట తడబాటు'ను సరిదిద్దుకోవడం వేరే సంగతి.
ఖాళీ అవుతున్న బియ్యం నిల్వల్ని - ఖరీఫ్ ఉత్తర్వులు వచ్చాక రైస్ మిల్లర్ల ద్వారా భర్తీ చేయాలని చెబుతున్నప్పుడు - పౌరసరఫరాల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పరిశీలిస్తారని రోశయ్య అన్నారు. వెంటనే 'మాట పొరపాటు'ను గ్రహించిన ఆయన 'మనం ఈ అంశాన్ని పరిశీలించాలి' అన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రస్తావన వచ్చినపుడు కూడా అర్హులైన వారికి ఆరోగ్య బీమా పథకం వర్తించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారంటూ.... అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అని ముక్తాయించారు.
ఇదంతా చూస్తే... మంత్రుల వైఖరితో తాను ముఖ్యమంత్రిని కాదని రోశయ్య భావిస్తున్నారేమో అనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి రోశయ్యేనని ప్రకటిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం... మంత్రులపై, పార్టీపై 'పట్టు' సాధించేందుకు, రోశయ్య పట్ల భయభక్తులు పెంపొందించేందుకు దృష్టి సారిస్తుందా? కాలయాపన చేస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.
Pages: -1- 2 News Posted: 18 September, 2009
|