జూలియా పూజ, భక్తుల తిప్పలు
భద్రతా వలయాన్ని ఛేదించడానికి ఎవరినీ అనుమతించేది లేదని స్థానిక సీనియర్ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. 'ఆశ్రమ్ హరి మందిర్ వెలుపల 100 మందికి పైగా పోలీసు సిబ్బంది ఉన్నారు. దాదాపు అంతే సంఖ్యలో పోలీసు సిబ్బంది ఆలయం లోపల ఉన్నారు. వారిలో యూనిఫారమ్ ధరించినవారూ ఉన్నారు. మఫ్టీ పోలీసులూ ఉన్నారు. ఈ వలయాన్ని ఎవ్వరూ ఛేదించజాలరు. బయటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే వారిని ఆశ్రమ్ లోకి ప్రవేశించేందుకు అనుమతించేది లేదు. మాకు కచ్చితమైన ఆదేశాలు జారీ అయ్యాయి' అని ఆయన తెలియజేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ టైగర్ పటౌడి, ఆయన కుమారుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ కుటుంబ గృహం పటౌడీ ప్యాలెస్ లో బస చేస్తున్న జూలియా రాబర్ట్స్ కు 40 మంది సాయుధ సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు.
ఇండియాకు వచ్చేంత వరకు కూడా జూలియా రాబర్ట్స్ ను పాశ్చాత్య దేశానికి చెందిన అత్యంత 'హిందువు అనుకూల' ప్రముఖురాలుగా పరిగణిస్తుండేవారు. ఈ సంవత్సరం మొదట్లో తాజ్ మహల్ సందర్శనకు వచ్చినప్పుడు ఆమె నుదుట బొట్టు పెట్టుకోవడం చూసి ఆమెను అంతా కొనియాడారు. భగవంతునికి, విశ్వానికి ప్రతీకగా ఆమె తన చిత్ర నిర్మాణ సంస్థకు 'రెడ్ ఓమ్' అని నామకరణం చేసినట్లు యూనివర్శల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం సంస్థకు చెందిన రాజన్ జెద్ తెలియజేశారు.
ఎలిజబెత్ గిల్బర్ట్ రచించిన, ఎక్కువగా అమ్ముడుపోయిన నవలకు చిత్రానువాదమే 'ఈట్, ప్రే, లవ్'. ఈ చిత్రంలో తన విడాకుల అనంతరం ఆధ్యాత్మిక ఆనందాన్ని అన్వేషిస్తూ ఇటలీ, ఇండియా, ఇండోనీషియాలలో ఏడాది పాటు గడిపిన రచయిత్రి పాత్రను జూలియా రాబర్ట్స్ పోషిస్తున్నది.
Pages: -1- 2 News Posted: 23 September, 2009
|