రాష్ట్ర కాంగ్రెస్ లో చీలికలు! దీనికి తోడుగా కాంగ్రెస్ పార్టీలో కూడా వైఎస్ విధేయ వర్గం - ఢిల్లీ అధిష్టానం విధేయ వర్గాలు రూపొందుతున్నాయి. ఇందుకు పీసీసీ చేపట్టిన పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమే వేదికగా మారింది. సభ్యత్వ నమోదు గురించి ఆయా జిల్లాల నేతలతో మాట్లాడేందుకు పీసీసీ అధ్యక్షుడు డీఎస్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లు రసాభాసగా మారాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నేతల నుంచి చేదు అనుభవం చవిచూసిన డీఎస్ కు శుక్రవారం కూడా మరోసారి కొన్ని జిల్లాల కాంగ్రెస్ నేతలు ఝలక్ ఇచ్చారు. పీసీసీ కార్యాలయం గాంధీ భవన్ నుంచి వరంగల్, చిత్తూరు, నెల్లూరు, ఖమ్మం, రాజమండ్రి, టౌన్ కమిటీ, ఇంతర పట్టణాల్లోగాని కాంగ్రెస్ కమిటీలతో టెలికాన్ఫరెన్స్ ను డీఎస్ నిర్వహించారు.
కాకినాడ పట్టణంలో టెలీకాన్ఫరెన్స్ ను వైఎస్ విధేయ వర్గం 'రద్దు' చేసింది. జగన్ ను సీఎం చేయడంలో జాప్యానికి నిరసనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని రాజమండ్రిలో కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిగా అమలాపురం ఎంపీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడారు. జగన్ ను సీఎం చేయాలనేవాళ్ళు ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎం చేసే అంశం తేలేదాకా తాము సభ్యత్వం నమోదు చేపట్టబోమని కొన్ని జిల్లాల్లో యువజన కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఏఐసీసీ నిర్దేశించిన సభ్యత్వం నమోదును ఆపడం సమంజసం కాదని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. ఈ వాదనను వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డీ వెంకటరమణారెడ్డి సమర్ధించారు. సభ్యత్వాన్ని నమోదు చేయాలా? వాయిదా వేయాలా అన్న విషయాన్ని తాము ఇంకా ఆలోచించుకోలేదని శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు కె.వీరభద్రస్వామి తెలిపారు.'
Pages: -1- 2 News Posted: 26 September, 2009
|