కీలక పంటలు నష్టం
అయితే, ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక అధికారులు మాట్లాడుతూ, పంట నష్టం తీవ్రంగానే ఉండవచ్చునని సూచించారు. ఉల్లి, మిర్చి, ద్రాక్ష, దానిమ్మ పంటలకు భారీ స్థాయిలోనే నష్టం వాటిల్లి ఉండవచ్చునని కర్నాటక ఉద్యాన శాఖ డైరెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్వెస్ట్ టెక్నాలజీ విభాగం అదనపు కార్యదర్శి జి.కె. వసంతకుమార్ సూచించారు.
దేశంలో ఉల్లిపాయల ఉత్పత్తి జరిగే రాష్ట్రాలలో మూడవ స్థానంలో కర్నాటక ఉంది. ఇప్పటికే ఉల్లిపాయలను కిలో రూ. 28 ధరకు విక్రయిస్తుండడంతో వినియోగదారులకు మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవు. 'దానిమ్మ పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది' అని వసంతకుమార్ తెలిపారు. కర్నాటక వేరుశనగ పంట నష్టాన్ని కూడా చూడబోతున్నది. ఇప్పటికే వేరుశనగ విస్తీర్ణం గత సీజన్ లో కన్నా ఈ ఖరీఫ్ కాలంలో 8.14 లక్షల హెక్టార్ల మేరకు తగ్గింది.
రాష్ట్రానికి చెందిన వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎపెడా) సభ్యుడు ఎ.వి. రంగారావు మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో పంట నష్టం అపారంగా ఉందని చెప్పారు. పత్తి, సపోటా, అరటి, వరి ధాన్యం పంటలు బాగా దెబ్బ తిన్నాయని ఆయన తెలిపారు.
ముందుగా విత్తనాలు నాటిన తృణధాన్యాల పంటలను మహారాష్ట్ర నష్టపోగలదని ఒక అధికారి సూచించారు. 'ఇది సంక్లిష్ట పరిస్థితి. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో అనావృష్టి వల్ల ఖరీఫ్ పంటలు ఇప్పటికే దెబ్బతిన్న స్థితిలో ఈ కీలక రాష్ట్రాలలో వరదలు సంభవించడం పులి మీద పుట్ర వంటిదే' అని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నష్టాలకు గురైన రైతులు తిరిగి పంటలు వేయగల స్థితికి చేరుకోగానే వారికి కావలసిన కొత్త విత్తనాలను శీఘ్రంగా సమకూర్చవలసిందిగా రాష్ట్రాలను కేంద్రం కోరింది.
Pages: -1- 2 News Posted: 7 October, 2009
|