జగన్ సిఎం కానట్లేనా?
ఈ సమావేశంలో జగన్ స్పందించే తీరును పార్టీ అధ్యక్షురాలికి కమిటీ నివేదిస్తుంది. దీని ప్రాతిపదికపైనే జగన్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అంశం ఆధారపడి ఉంటుంది. తదనంతరం జగన్ కు మార్గదర్శక బాధ్యతలు చేపట్టిన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావును పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ శాసన సభా పక్షం (సిఎల్పీ) సమావేశం సాఫీగా సాగేలా చూసే బాధ్యతను అప్పగించనున్నది. కేవిపి నుంచి ఈ మేరకు స్పష్టమైన హామీని పొందిన తర్వాతే సిఎల్పీ సమావేశానికి ముహుర్తాన్ని నిర్ణయిస్తుంది. సమావేశంలో కేవలం రెండే రెండు తీర్మానాలు ప్రవేశపెడతారు. అందులో ఒకటి దివంగత ముఖ్యమంత్రి, సిఎల్పీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మృతికి సంతాపం తెలపడం ఒకటి. రెండోది శాసనసభా పక్షం నాయకుడిని ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగించడం.
ఢిల్లీ నుంచి వచ్చే పార్టీ పరిశీలకులు ఈ పనిని సాఫీగాను, విజయవంతంగాను ముగించి ఈ సమాచారాన్ని ఢిల్లీకి చేరవేసిన అనంతరం సోనియా గాంధీ సిఎల్పీ నాయకుడిగా రోశయ్య పేరును ఖరారు చేస్తున్నట్లుగా లాంఛనంగా ఒక వర్తమానం పంపిస్తారు. రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న యువ ఎమ్మెల్యేలకు సైతం పార్టీ అధిష్టానం పనిలో పనిగా ఒక గుణపాఠం చెప్పబోతోంది. భవిష్యత్తులో పార్టీని ధిక్కరించడానికి సాహసించలేని రీతిలో ఈ పాఠం ఉంటుందని అంచనా. సిఎల్పీ నాయకుడిగా రోశయ్య పేరును సోనియా గాంధీ ఖరారు చేసిన అనంతరం రోశయ్య పేరును జగన్ చేత ప్రతిపాదించాలన్నది అధిష్టానం ఆలోచన. పార్టీలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యుడైనందున రోశయ్యను పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగించాలన్న పార్టీ అధిష్టానం ఆలోచన ఈ విధంగా ఆచరణలోకి రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Pages: -1- 2 News Posted: 7 October, 2009
|