తొలి టెస్ట్ పాసైన రోశయ్య!
పరిపాలన విషయంలో హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛలభించడంతో రోశయ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను మెల్ల మెల్లగా తన దారికి తెచ్చుకోవడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒక వైపు వైఎస్ మరణంతో ఏర్పడిన రాజకీయ సమస్యలు, మరో వైపు వరదలు సృష్టించిన అల్లోకల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న రోశయ్య ఇక తన సత్తా ఏమిటో చాటు కునేందుకు సిద్ధమయ్యారు. సొంత ముద్రతో ప్రభుత్వ పాలనను గాడిలోపెట్టేం దుకు సొంత జట్టును సిద్ధం చేసుకునే కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగానే పరిపాలనపై పూర్తిగా దృష్టి సారించే తనకు నచ్చిన, మెచ్చిన వారితో రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
వ్యక్తిగత కారణాలతో వైఎస్ మంత్రివర్గంలో తీసుకోకుండా పక్కన పెట్టిన సీనియర్లు, మాజీ మంత్రులు, పరిపాలనపై అవగాహన, పట్టు కలిగిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలో తీసుకోవడం ద్వారా పరిపాలనను మరింత పటిష్టం చేయాలన్న పట్టుదలతో రోశయ్య ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సమర్ధులు, తనకు విధేయులుగా ఉంటూ, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి హైకమాండ్ నిర్ణయాలను గౌరవించే వారిని కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాను సిఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పూర్తిగా సహకరిస్తున్న మంత్రులను కొనసాగించాలనే నిర్ణయానికి రోశయ్య వచ్చినట్లు కనబడుతోంది. మంత్రివర్గ విస్తరణ, ఎవరెవరిని కేబినెట్‌లో తీసుకోవాలి, ఎవరెవరికి ఉద్వాసన చెప్పాలి తదితర విషయాలను ఇప్పటికే రోశయ్య అధిష్ఠానంతో చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ముందు రోశయ్య ఢిల్లీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Pages: -1- 2 News Posted: 7 October, 2009
|