కత్తి దూసిన రోశయ్య వరద ముప్పు నుంచి తెప్పరిల్లాకా ఇక సహాయ పునరావాస పనులు గాడి పడ్డాయని నిర్ధారించుకున్న తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య తన కత్తి పదును రుచి చూపించడం మొదలు పెట్టారు. ముందుగా రాష్ట్ర పౌరవిమానయాన సంస్థ అధిపతిని తుళ్ళగొట్టారు. వెంటనే పరిశ్రమల శాఖ శ్రీలక్ష్మిని వెళ్ళగొ్ట్టారు. ఈ విభ్రమం నుంచి మంత్రులు, అధికారులు తేరుకోకమునుపే ఐపిఎస్ లకు స్థాన చలనం కలిగించారు. రోశయ్య ఈ ప్రక్షాళన చేపట్టడానికి ముందు ఆయనకు విపరీతమైన బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్నీ ఇచ్చే పరిణామాలు ఢిల్లీ స్థాయిలో చోటుచేసుకున్నాయి. ఎవరెంతగా పాకులాడినా వైఎస్ తనయుడు జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే యోచనే లేదని అధిష్టానం తేటతెల్లం చేసింది. అదే సమయంలో రోశయ్యను ఇప్పుడప్పుడే మార్చే యోచన కూడా లేదని స్పష్టం చేసింది. ఇంతవరకూ వైఎస్ జగన్ కు గానీ, అయన తరఫున లాబీయింగ్ చేస్తున్న రాజ్యసభ సభ్యడు కేవీపీ రామచంద్రరావుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మూడు రాష్ట్రాల ఎన్నికల నెపంతో కాలం సాగదీసిన అధిష్టానం ఈలోగా జగన్ విధేయులకు హెచ్చరికలు పంపింది.
వరద ప్రాంతాలను సందర్శించడానికి వచ్చినప్పుడే సోనియాగాంధీని ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య తొలిసారిగా కలుసుకున్నారు. 'బాగా పనిచేస్తున్నారు. కీపిటప్' అంటూ సోనియాగాంధీ రోశయ్యను అభినందించడం ద్వారా ముఖ్యమంత్రి పదవికి వ్యక్తుల మార్పులేదనే సంకేతాన్ని మొట్టమొదటిసారిగా ఇచ్చారు. దాంతో బలం పుంజుకున్న రోశయ్య పరిపాలన యంత్రాంగంలో ప్రక్షాళన మొదలు పెట్టారు. పోనీ రోశయ్య వేసిన వేటును విమర్శించే అవకాశం కూడా ఎవరీకీ లేకుండా పోయింది.
విధేయత ప్రకటించిన తనకు నచ్చిన వారిని స్వర్గీయ వైఎస్ తన హాయాంలో పదవుల్లోకి తీసుకువచ్చారు. సమర్ధత కంటే ఇతర అంశాలే అందలాలు ఇచ్చాయి. అలానే కీలకమైన పదవుల్లో ఉండి తప్పిదాలు చేసినా వాటిని పట్టించుకోని అనవసర ఉదారతను వైఎస్ ప్రదర్శించేవారు. ఇప్పుడు రోశయ్య సమర్ధతనే గీటురాయిగా మార్చుకున్నారు. విధేయులను క్షమించేంత అవకాశం, అవసరం రోశయ్యకు లేదు. ఎందుకంటే తన హయాంలో సుపరిపాలన మాత్రమే ఆయన కోరుకుంటున్నారు. మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన, దాని కోసం విధేయులను, అనుచర గణాన్ని తయారుచేసుకోవాల్సిన అగత్యం రోశయ్యకు ఎంతమాత్రం కనిపించడం లేదు. అందుకే రాబోయే నాలుగున్నర సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన ఇవ్వడం ద్వారా మరోమారు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి తన కర్తవ్యాన్ని నెరవేర్చాలన్న ధ్యేయంతోనే ఆయన ఉన్నారని రోశయ్య సన్నిహితులు చెబుతున్నారు.
ఇక ఐఎఎస్ అధికారుల వంతు నేడో రేపో వస్తుందని, మరో వారం రోజుల్లో మంత్రి వర్గం మార్పులూ తప్పవని వారు వివరిస్తున్నారు. సమర్ధులైన ఐఎఎస్ అధికారులు ఎక్కడ ఉన్నా వారిని రప్పించి సేవలు వినియోగించుకోవాలని, దీనికి నిజాయితీ ఒక్కటే గీటురాయిగా పరిగణనలోనికి తీసుకోవాలని రోశయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే వైఎస్ దూరంగా పెట్టిన సమర్ధులైన నాయకులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. సీనియర్ మర్రి శశిధర్ రెడ్డి, జేసీ లాంటి అనుభవజ్ఞుల సేవలను వినియోగించుకోవాలని, వైఎస్ విధేయులపై కక్షకట్టారనే అపప్రధ రాకుండానే ఆ వర్గానికి ఝలక్ ఇవ్వాలని రోశయ్య భావిస్తున్నారని వివరిస్తున్నారు. ఏది ఏమైనా రోశయ్య పైకి కనిపించినంత మెతకగా ఉండబోవడం లేదని, ఇకనుంచి రోశయ్య నాయకత్వంలో పనిచేయడం ఎవరికైనా కత్తి మీద సామేనని చెప్పవచ్చు.
Pages: -1- 2 News Posted: 8 October, 2009
|