నోబెల్ 'వెంకీ' - సైకిల్ ఓనరు వెంకీకీ కారు లేదు. పని చేయడానికి ఇప్పటికీ సైకిల్ మీదే వెళతాడు. సాదాసీదాగా ఉండటమే వెంకీకి ఇష్టం. కాని ఇతరులకు సాయపడతాడు. ముఖ్యంగా యువతీ యువకులకు సలహాలు ఇవ్వడం, చదువు చెప్పడం అంటే మక్కువని సీనియర్ రామకృష్ణన్ చెబుతున్నారు. నోబెల్ బహుమతి పొందిన పుత్రుడిని చూసి పులకించిపోతున్న ఈ 87 యేళ్ల వృద్ధ తండ్రి మొదట తాను వెంకీకి నోబెల్ వచ్చిందంటే నమ్మలేదని అన్నారు. అర్ధరాత్రి ఈ కబురు తెలిసినా తన నిద్ర చెడగొట్టడం ఇష్టం లేక వెంకీ ఫోను చేయలేదని, కానీ అప్పటికే టెలివిజన్ రిపోర్టర్లు తనను సతాయించారని వివరించారు.
వెంకీ చదువు చిత్రమైన మలుపులే తిరిగిందని, మెడిసిన్ చదవమంటే భౌతిక శాస్త్రం చదివి
దానిలోనే పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన వెంకీ పరిశోధనలకు మాత్రం జీవశాస్త్రంలో డాక్టరేట్ సాధించాడని వివరించారు. అలానే రైబోసోమ్ నిర్మాణాన్ని వివరించే పరిశోధనలో మరో ఇద్దరితో కలిసి నోబెల్ పొందటం నిజంగానే వెంకీ ప్రతిభకు తార్కాణమని చెప్పారు.
పరిశోధనలే కాదు వెంకీ, అతని సోదరి లలితకు కూడా సైకిల్ పై ప్రయాణమంటే మహా సరదా. పర్వతారోహణం అన్నా మక్కువేనని ఆయన తెలిపారు. వెంకీ ఇప్పటకీ పాతిక మైళ్ళు సైకిల్ పై వెళతాడని, ప్రకృతిని గమనించడం అంటే ప్రాణమని వివరించారు. వెంకీ, అతని సోదరి కూడా తాము సంపాదించిన డబ్బును యునిసెఫ్, రామకృష్ణ మఠాలకు విరాళాలు గా ఇచ్చేస్తారని చెప్పారు. అలాగని వెంకీ అధ్యాత్మకవాదని భావించడం లేదని, కానీ సాటి మానవులకు సాయపడటమే వెంకీకి ఇష్టమని సీనియర్ రామకృష్ణన్ వివరించారు.
Pages: -1- 2 News Posted: 8 October, 2009
|