దారికొస్తున్న మంత్రులు జగన్ ను సీఎం చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ ఉండదని కూడా కొందరు 'జోస్యం' చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఇంకొందరు మంత్రులు పేర్కొన్నారు. ఇలా ప్రచారం చేసినవారిలో గీతారెడ్డి, సబితారెడ్డి, అరుణకుమారి, వట్టి వసంతకుమార్ తదితరులు ఉన్నారు. అయినప్పటికి కూడా అధిష్టానం ఏమాత్రం సడలకుండా 'సీ' బ్లాక్ లోకి రోశయ్యను పంపించడంతో వీరంతా నిస్సహాయ స్థితిలో పడ్డారు. జగన్ కు వ్యతిరేకంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నా కూడా కిమ్మనలేని స్థితిలో మంత్రులు, శాసనసభ్యులు ఉన్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని 'తిరుగుబాటు' చేసే సాహసం చేయబోరని అంటున్నారు. వీరంతా కూడా 'జగన్' అంశంపై సోనియా నిర్ణయం వెలువడే వరకు సీఎం రోశయ్యతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు.
వైఎస్ సన్నిహిత మిత్రుడు కేవీపీ రామచంద్రరావు ఢ్లిల్లీ దౌత్యం విఫలమైన నేపథ్యంలో వైఎస్ వర్గంలో తొలిసారి ఎన్నికైన శాసనసభ్యులు 'నాయకత్వం' సమస్యపై ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇటీవల కేవీపీ ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాతో, కోర్ కమిటీతో కానీ సమావేశానికి 'అవకాశం' లభించలేదు. రాష్ట్రంలో వరత బాధిత ప్రాంతాలను సోనియా గాంధీ సందర్శించినపుడు కూడా కేవీపీకి ఆహ్వానం లేదు. ఈ క్రమంలో 'జగన్'ను ముఖ్యమంత్రి చేయాలన్న నినాదం రాష్ట్రంలో 'వరదల' నేపథ్యంలో సద్దుమణిగింది. తిరిగి ఈ నినాదాన్ని కాంగ్రెస్ శాసనసభ్యులు గట్టిగా నినదించడానికి అనువైన పరిస్థితులు వస్తాయా? వచ్చినా... ఇంతకు ముందు మాదిరిగా 'జగన్నినాదం' ప్రతిధ్వనిస్తుందా అన్నది శేష ప్రశ్నే!
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|