ఎండిపోతున్నసుంకేశుల
కడప-కర్నూలు జిల్లాల్లో దాదాపు 300 గ్రామాలకు సుంకేశుల తాగునీటిని అందిస్తోంది. అలానే 2లక్షల 70 వేల హెక్టార్ల భూమికి సాగునీరు సరఫరా చేస్తోంది. కెసి కాలువ ద్వారా సాగునీరు పోలాలకు చేరుతుంది. ప్రస్తుత పరిస్థితి వలన రెండు జిల్లాలకు చెందిన లక్షలాది మంది రైతులు తీవ్రంగా దెబ్బతింటారని ఇంజనీరు సుబ్బారాయుడు చెప్పారు. 5.24 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుకూలంగా ఈ ప్రాజెక్టుని నిర్మించారు. కానీ మొన్న ముంచెత్తిన పెను వరదలో సుంకేశులకు చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా పదిన్నర లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాం విరుచుకుపడింది. అధికారులు సకాలంలో స్పందించలేకపోవడంతో మట్టి కట్టలపై నీటి ఉథృతి ప్రతాపం చూపించింది. కరకట్టలపై నుంచి నీటి ప్రవాహం మొదలైన కొద్ది సేపటికే అవి వెన్నముద్దల్లా కరిగిపోయాయి. కిలోమీటరు పొడవునా గండి కొట్టేసింది. ప్రచండ వేగంతో ప్రవహించిన నీరు ముందు సుంకేశుల గ్రామాన్ని, తరువాత రాజోలి గ్రామాన్ని మింగేసింది. తుంగభద్రమ్మ ఉగ్రరూపం గమనించి బ్యారేజ్ కు ఉన్న 30 గేట్లు ఎత్తివేయమని అధికారులను ప్రాధేయపడ్డాం. కానీ వారు తమ మొర ఆలకించలేదని రైతు సంఘం నాయకుడు రామలింగేశ్వరరెడ్డి చెప్పారు.
నిజానికి అక్టోబర్ ఒకటో తేదీనే బ్యారేజ్ 24 గేట్లు ఎత్తి వేసి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేశారు. మరో ఆరు గేట్లను కూడా ఎత్తేసి ఉంటే మరో 1.2 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు పోయేది. అప్పుడు మట్టికట్టలపై నుంచి ప్రవాహం వచ్చి ఉండేది కాదు. గండ్లు పడకపోతే సుంకేశుల, రాజోలి గ్రామాలు సురక్షితంగా ఉండేవని నీటిపారుదల నిపుణుడు ఎల్ ఎస్ శాస్త్రి వివరించారు. అయితే అనూహ్యంగా మర్నాటి ఉదయానికే బ్యారేజ్ నీటి ప్రవాహం 8.16 లక్షల క్యూసెక్కులకు చేరిపోయిందని, మట్టికట్టలపై నుంచి నీరు ప్రవహించడం, ఆ కట్టలు కరిగిపోయి కిలోమీటరు మేర గండ్లు పడిపోవడం క్షణాల్లో జరిగిపోయిందని ప్రాజెక్టు డెప్యూటీ ఇఇ రాజన్ బాబు వివరించారు. మేము మా ప్రాణాలు కాపాడుకోటానికి ప్రాజెక్టు రెండో వైపునకు చేరుకున్నాం. ఈ లోగానే సుంకేశుల, రాజోలి గ్రామస్తులకు హెచ్చిరకలు పంపించామని ఆయన తెలిపారు. మిగతా ఆరుగేట్ల తెరవడానికి సాంకేతికపరమైన సమస్యలు వచ్చాయని ఆయన చెప్పారు. గేట్ల పై కప్పుకు తుప్పు పట్టి మొరాయించాయని, అయిదు గేట్లకు ఉన్న ఇనుపమోకులు తుప్పుతో బిగుసుకుపోయాయని వెల్లడించారు. మరో గేటు స్టాప్ లాక్ వరదనీటితో పాడైపోవడంతో తెరచుకోలేదని చెప్పారు. ఏది ఏమైనా కడప- కర్నూలు జిల్లాల ప్రజలకు వరద కష్టాలు ఇప్పడప్పుడే తీరేటట్లు కనిపించడం లేదు.
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|