మావోలపై 'గగన' యుద్ధం ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన దేశ అంతర్గత భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం జరుగుతూ ఉండగానే మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టులు పదిహేడు మంది పోలీసులను కాల్చి చంపేశారన్న వార్త అందింది. సమావేశంలో ప్రధానంగా నక్సలైట్ల కార్యకలాపాల మీదే చర్చజరిగిందని జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ తెలిపారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోలను నిరోధించడానికి అమలు చేస్తున్న కార్యకలాపాలను కేంద్ర హోం మంత్రి పి చిదంబరం సమావేశంలో వివరించారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగమై కోబ్రా దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ఆపరేషన్ గ్రీన్ హంట్' గురించి, దాని ఫలితంగా మావోయిస్టు నేతలు కోబాడ్ గాంధీ, ఛత్తధర్ మహతో అరెస్టుల విషయాన్ని చిదంబరం ప్రధానికి వివరించారు.
మావోయిస్టులను అంతమొందించడానికి స్తానిక యంత్రాంగం, కేంద్రం సమన్వయంతో పనిచేయాలని, అంతర్రాష్ట్ర సరిహద్దులను జోన్ లుగా విభజించి దళాలను మోహరించాలని చిదంబరం పేర్కొన్నారు. ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సరిహద్దుల్లో సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ఎన్నికల కోసం కేంద్ర బలగాలను నియమించామని, గడ్చిరోలి ఉదంతం తరువాత వీటిని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలకు తరలించవలసిన అవసరం ఉందని చిదంబరం పేర్కొన్నారు.
ఈ సమావేశంలోనే వైమానిక దళ సేవలను వినియోగించుకోవడంపై కూలంకషమైన చర్చ జరిగింది. దుర్గమమైన అరణ్యాల్లో, పర్వతాల్లో తలదాచుకుంటూ హఠాత్తుగా విరుచుకుపడుతున్న మావోయిస్టులను నిరోధించడానికి వైమానిక దళాన్ని రంగంలోకి దించాలని కేంద్రం అభిప్రాయపడింది. ఉపగ్రహాల ద్వారా మావోల జాడ కనిపెట్టడం, వారి పైకి వైమానిక దళాలను ప్రయోగించడంతో పాటు ఆధునిక ఆయుధాలతో కోబ్రా బలగాలను రంగంలోకి దించడం ద్వారా మావోల ఆటలు కట్టించాలన్నది కేంద్రం వ్యూహం.
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|