కాంగ్రెస్ ధీమాగా ఉన్నా...
కాగా, బిజెపి పట్ల గుజరాతీ, మరాఠీ వోటర్లు విసుగు చెందడం కాంగ్రెస్ పార్టీలో ఆశలను మరింత పరిపుష్టం చేసింది. అన్య ప్రాంతీయులకు వ్యతిరేకంగా శివసేన, రాజ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) సాగిస్తున్న ప్రచారం ఇందుకు కారణం. గంపగుత్తంగా ముస్లిం వోట్లతో పాటు మరాఠీయేతర వోట్లలో అధిక శాతం తమకు పోల్ కాగలవని, బహుళ పక్ష పోటీ ఉన్న స్థానాలలో తమ అభ్యర్థుల విజయానికి ఇటువంటి వోట్లు దోహదం చేయగలవని కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారు. 'మా అభ్యర్థులలో అధిక సంఖ్యాకులు వెయ్యి లోపు వోట్ల తేడాతో గెలిచినా మేము ఆశ్చర్యపోము. ఎంఎన్ఎస్ గణనీయంగా వోట్ల వాటాను సంపాదించినప్పటికీ ఆ పార్టీకి పదిలోపే సీట్లు రావచ్చు. చివరకు తృతీయ ఫ్రంట్ కూడా రెండంకెల స్కోరును చేరుకోలేకపోవచ్చు' అని మహారాష్ట్ర సీనియర్ నాయకుడు ఒకరు సూచించారు.
ఇక హర్యానాలో ఎన్నికల ప్రక్రియను నిశితంగా గమనిస్తూ వచ్చిన కాంగ్రెస్ నాయకులలో ఉన్న ధీమా స్థాయి కూడా క్రమంగా తగ్గిపోయింది. అదే సమయంలో ఇతరులు అఖండ విజయం తప్పదని జోస్యం చెబుతున్నారు. ప్రతిపక్షాలు చీలిపోవడంతోను, మే లోక్ సభ ఎన్నికలలో అనూహ్యంగా పార్టీ అఖండ విజయం సాధించడంతోను ఈ దఫా తమకు ఎదురే ఉండదంటూ కాంగ్రెస్ కలల్లో తేలిపోయింది. కాని వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అనేక స్థానాలలో పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నట్లు తెలుస్తున్నది.
మాయావతితో లోపాయికారి అవగాహన రీత్యా ఓమ్ ప్రకాశ్ చౌతాలా నాయకత్వంలోని భారత జాతీయ లోక్ దళ్ (ఐఎన్ఎల్ డి)కి దళితుల వోట్లు పడే అవకాశం ఉండడం కాంగ్రెస్ పార్టీని కొత్తగా కలవరపెడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా జనాకర్ష శక్తిపైనే కాంగ్రెస్ ప్రధానంగా ఆధారపడింది. సాంప్రదాయకంగా చౌతాలాకు వోట్లు వేస్తుండే జాట్ల మద్దతును కూడగట్టుకోవడంతో హూడా దుర్భేద్యమైన కోటను నిర్మించుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఈ వ్యూహం కొంత రిస్క్ తో కూడుకున్నది. జాట్లు కానివారు, దళితులతో కాంగ్రెస్ పార్టీకి ఛత్రంగా ఉపయోగపడుతున్న కొన్ని వర్గాలు దీని వల్ల పార్టీకి దూరం కావచ్చు. లోక్ సభ ఎన్నికలలో ఇదే పరిస్థితి తలెత్తింది. బిఎస్ పి వోట్ల వాటా గత అసెంబ్లీ ఎన్నికల నాటి 3.22 శాతం నుంచి ఏకంగా 12.09 శాతానికి పెరిగిపోయింది.
Pages: -1- 2 News Posted: 13 October, 2009
|