అడగరు...వదలరు ఆంధ్రాలోని రచ్చను పట్టించుకోని అధిష్టానం తన పని మాత్రం చేసుకుపోతోందని చెబుతున్నారు. ఒకవేళ రోశయ్యను కొనసాగించే అవకాశం లేకపోతే మరో కొత్త 'రెడ్డి ముఖం' కోసం అన్వేషణ సాగిస్తోందట!. గతంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చినా ఇప్పుడాయన పేరు సోదిలో లేదు. ఇక వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి, మాజీ మంత్రి కె జానారెడ్డి, మాజీముఖ్యమంత్ర తనయుడు చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధరరెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నయంటున్నారు. అయితే వీరెవరినీ ముఖ్యమంత్రి పదవికి జగన్ అంగీకరించకపోవచ్చు. అంతకంటే ఎలాంటి రెడ్డి ముద్ర లేని రోశయ్యను కొనసాగించడానికి జగన్ అంగీకరిస్తారు. ఎందుకంటే రోశయ్య స్వర్గీయ వైఎస్ కు ఎంతో ఆత్మీయుడు. అలానే జగన్ కు శ్రేయోభిలాషి కూడా. మరో వ్యక్తిని తెర మీదకు తెచ్చే కంటే రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండటానికే జగన్ ఇష్టపడతారని చెబుతున్నారు.
అధిష్టానం ఇచ్చే మంత్రి పదవులను తిరస్కరించినా, ఎదురు తిరగడానికి జగన్ సుముఖంగా లేరని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏమి చెబితే దానికి జగన్ ఆమోదం తెలిపే అవకాశాలే ఎక్కువున్నాయని అంటున్నారు. అలా అని అధిష్టానం కూడా జగన్ ను పక్కన పెట్టే యోచనలో లేదని, మంత్రి పదవులను వద్దంటే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను ఆయనకు ఇవ్వాలనే యోచనలో ఉందని వివరిస్తున్నారు. పార్టీ బాధ్యతలు ఇస్తే జగన్ తురుపుముక్కగా ఉపయోగపడతారని, యువతలో స్థానం సంపాదిస్తారని, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మంచి సమన్వయం సాధిస్తారని జగన్ సన్నిహితులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో సాగుతున్న జగన్నాటకానికి కాంగ్రెస్ అధిష్టానం తెర దించడానకి సన్నద్దమవుతోందని, బహుశా అక్టోబర్ నెలాఖరుకు అంతిమ తీర్పు వెలువడగలదని వారు చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 21 October, 2009
|