చెలరేగుతున్న 'చంద్రులు'
మరో పక్కన తెరాస అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమ నిర్వహణలో తన పాత ధోరణిని కొద్దిగా మార్చుకొన్నారు. ఇంతకాలం మీడియాను ముప్పుతిప్పలు పెట్టిన ఆయన ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. తాను ఎక్కడ ఏ మాత్రం నోరు అదుపు తప్పి మాట్లాడినా గోరంతలు కొండంతలు చేసి నానా యాగీ చేస్తున్న మీడియాతో పెట్టుకుంటే మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని భావించినట్లున్నారు. ఇదివరకటిలా అంసదర్భపు మాటలను వదరకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం సహా ప్రధానిని, ముఖ్యమంత్రి రోశయ్యను ఇలా ప్రతి ఒక్కరినీ విమర్శలతో విసుగెత్తిస్తున్నారు. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చిన ప్రధాని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తేల్చకుండా సమైక్యాంధ్రకే చివరి వరకూ కట్టుబడి ఉన్న వైఎస్ లేకపోవడంతో కేసీఆర్ ఇప్పుడు చెలరేగుతున్నారు. పూర్తి స్థాయిలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నానో లేదో తెలియని స్థితిలో రోశయ్య ఉండగా, తనకు సిఎం పదవి వస్తుందో రాదో తెలియని అయోమయంలో వైఎస్ జగన్ ఉన్నారు. అడగకుండానే అన్నీ అందుకుంటున్నానంటూ రోశయ్య చెబుతుంటే, అడగకుండానే సిఎం పదవి తనను వరించాలన్న ధోరణిలో జగన్ ఉన్నారు. ఈ పిల్లి - పిల్లి పోరు మధ్యన రొట్టెముక్కను ఎత్తుకుపోవాలన్న వ్యూహంతో కేసీఆర్ మరోసారి పావులను వేగంగా కదిలిస్తున్నారు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాసం పెడతామంటారు. మరోసారి కేంద్ర ప్రభుత్వాన్నే అవిశ్వాసంతో కూలగొట్టేస్తానంటున్నారు కేసీఆర్.
గత ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణ అంశానికి మద్దతు ప్రకటించాయి. దీనితో ప్రస్తుతం అది రాజకీయంగా స్తబ్ధుగా మారింది. గత ఎన్నికల్లో పరువు పోయి నిస్త్రాణగా ఉన్న కేసీఆర్ కు హైదరాబాద్ ఫ్రీ జోన్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మళ్ళీ ప్రాణాలు తీసుకువచ్చినట్లైంది. 'తెలంగాణా వాళ్ళు మేల్కోవాలని, ఆంధ్రావాళ్ళు పారిపోవాలం'టూ సరికొత్త నినాదాన్ని తెరమీదికి తెచ్చారు. ఫ్రీ జోన్ వ్యవహారంపై సిద్దిపేటలో బుధవారం జరిగిన 'తెలంగాణ ఉద్యోగ గర్జన' సభలో కేసీఆర్ 'ఇక కొట్టుడు షురూ అవుతుంద'ని ప్రకటించారు. నవంబర్ నెల చలిమంటల్లోంచి తెలంగాణ బడబాగ్ని మొదలవుతుందని హెచ్చరించారు. ఏదో విధంగా మళ్ళీ తెలంగాణ ప్రజల్లో వేడి రగిలించి తన ఉనికిని మళ్ళీ చాటుకునేందుకు, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలని తీవ్రంగా తాపత్రయపడుతున్నారు.
Pages: -1- 2 News Posted: 22 October, 2009
|