జగన్... గురిపెట్టిన గన్ అదే సమయంలో తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించానని కూడా బయటపెట్టారు. తండ్రి అసంపూర్ణంగా వదిలిన పనులను పూర్తి చేయాలని బాధ్యత కలిగిన ఏ కొడుకైనా అనుకోవడం తప్పా? అన్న ప్రశ్న వెనుక ఉన్న భావం అదే. అంతేనా తనకు సొంత బలం చాలా ఉందనే విషయాన్నీ నర్మగర్భంగా పేర్కొన్నారు. ఇంతకాలం తనకు అండగా నిలచిన మంత్రులకు, శాసనసభ్యలకు, ఎంపీలకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు చెబుతూ చాలామంది ఈరోజు రాలేకపోయారని జగన్ అన్నారు. అంటే మీడియా సమావేశం సమయంలో ఉన్న వారే కాక జిల్లాల్లో ఉండిపోయిన వారు కూడా తన వారేనని చెప్పడమే జగన్ ప్రధాన ఉద్దేశం.
జగన్ కాదని తేలిపోయింది కాబట్టి రోశయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే వాదించేవారికి, భావించే వారికి కూడా జగన్ ఫక్తు కాంగ్రెస్ నాయకుడిలా మెలిక పెట్టారు. రోశయ్యగానీ లేదా ఆయన స్థానంలో మేడమ్ ఎవర్ని ముఖ్యమంత్రిని చేసినా తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని ఆ యువనేత ప్రకటిస్తూ జాగ్రత్తగా పరికించేవారిలో చిన్నపాటి ప్రకంపనలు పుట్టేటట్లు చేసారు. ముఖ్యమంత్రిగా రోశయ్య కొనసాగడం అనే అంశంలో అధిష్టానం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని జగన్ తన మాటలతో పరోక్షంగా సూచించారు. అంతేనా ప్రభుత్వంలో, పార్టీలో ఇక నుంచి వైఎస్ బ్రాండ్ జగన్ ముద్ర ఉండితీరుతుందని కూడా తేటతెల్లం చేశారు. ప్రభుత్వ పనితీరును తాను గమనిస్తానని, వైఎస్ హామీలు సంపూర్ణంగా అమలు జరగడం లేదన అనడం ద్వారా ప్రభుత్వం పైన, 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న వైఎస్ ఆకాంక్షను నెరవేర్చడానికి కృషి చేస్తానని, అది తన కర్తవ్యమని స్పష్టం చేయడం ద్వారా పార్టీ పైన తన పట్టు ఉంటుందని జగన్ చెప్పకనే చెప్పారు. సరే ముఖ్యమంత్రి కథ కంచికి చేరే దశలో ఉంది. ఇక కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం అనే రసవత్తర ఘట్టానికి తెర లేస్తోంది.
Pages: -1- 2 News Posted: 23 October, 2009
|