పేదల పెద్ద మనసు పనీపాటా తప్ప మరేమీ తెలియని వీరు ఇరవై అయిదు లక్షల రూపాయల పెద్ద మొత్తాన్ని విరాళంగా ఎలా ఇచ్చారన్నది కూడా ఆసక్తి దాయకమే. వీరంతా పొదుపు సంఘాలుగా ఏర్పడి బ్యాంక్ ల నుంచి 12 శాతం వడ్డీకి చిన్న మొత్తాల్లోరుణాలు తీసుకుంటున్నారు. వీరు చెల్లించే రూపాయి వడ్డీలో ముప్పావలాను ప్రభుత్వం రాయితీ కింద చెల్లిస్తోంది. అంటే బ్యాంక్ లకు పొదుపు మహిళలు చెల్లించేది పావలా వడ్డీయే. దాదాపు 27 గ్రామాల మహిళలు తామంతా వరద బాధితులకు అండగా నిలవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమకు ప్రభుత్వం వడ్డీ రాయితీ కింద చెల్లించాల్సిన ఇరవై అయిదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దీనివల్ల ప్రతి మహిళా వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు వడ్డీ భారాన్ని భరించాల్సి ఉంటుంది. తామంతా కూడా స్వచ్ఛందంగానే, బాధితులకు చేతనైన సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చామని పాలకొలను గ్రామానికి చెందిన మహిళ లక్ష్మీదేవి చెప్పారు.
వీరి సాయం విరాళం ఇవ్వటంతోనే ఆగిపోలేదు. కర్నూలులో నిరాశ్రయులకు సాయం అందించడంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్ డీఏ) కు పొదుపు మహిళలు తోడ్పడుతున్నారు. ఓర్వకల్లు మండలంలోని కొన్ని గ్రామాల్లో 1500 క్వింటాళ్ళ బియ్యాన్ని, ఇతర వెచ్చాలను వీరు సేకరించారు. బాధితులకు ఆహారాన్ని అందించేందుకు వంటావార్పును కూడా వారే ప్రారంభించారు. ఓర్వ కల్లులోని ఒక పాఠశాలను వంటశాలగా మార్చారు. 250 మంది సభ్యులు వంట మనుషుల అవతరం ఎత్తారు. వీరంతా కలిసి వండిన వంటని డీఆర్ డీఏ అధికారుల సూచన మేరకు అవసరమైన చోటకు మరో 250 మంది సభ్యులు తరలించి పంపిణీ చేశారు. దాదాపూ రోజుకి లక్ష మందికి భోజనాలు సమకూర్చారు. ప్రకృతి కన్నెర్ర జేసిన సమయంలో ఇంతగా తమ శ్రమను, ధనాన్ని వెచ్చించిన వీరి మానవత ముందు శ్రీమంతుల 'దానం' ఏపాటిది?
Pages: -1- 2 News Posted: 24 October, 2009
|