రోశయ్య... వేసేనా వేటు? సెప్టెంబర్ లో వైఎస్ ఆకస్మికంగా మృతి చెందిన తరువాత వైఎస్ స్థానంలో జగన్ ను కూర్చోబెట్టాలని పలువురు మంత్రులు డిమాండ్ చేశారు. వారెవరూ, ఏ దశలోనూ ముఖ్యమంత్రి రోశయ్యను పల్లెత్తు మాటనలేదు. సీఎం రోశయ్యను మార్చేది లేదని అధిష్టానం ప్రకటించిన వెంటనే... పరిస్థితులను అర్థం చేసుకున్న మంత్రులు ముఖ్యమంత్రికి సహకరించడం ప్రారంభించారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. వ్యవహారాల ఇన్ ఛార్జి వీరప్ప మొయిలీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కోరితే తప్ప మంత్రివర్గంలో ప్రత్యేకంగా మార్పులు చేయాలని అధిష్టానం భావించడం లేదని చెప్పారు. సీఎల్ పీ సమావేశానికి త్వరలో తేదీ ఖరారు అవుతుందన్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు డీఎస్ సోమవారం ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రోశయ్య కూడా మంగళవారం ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.
రోశయ్య కేబినెట్ లో 'బెర్త్'లు కోరుతున్న వారిలో మాజీ మంత్రులు జానారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పి శంకరరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కుతూహలమ్మ ఉన్నారు. సీనియర్ శాసనసభ్యులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్, బసవరాజు సారయ్య, ఎం మహీందరరెడ్డితో పాటు ఎంఎల్ ఎలు కేఆర్ ఆమోన్, ఆర్ పద్మరాజు తదితరులు ఉన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని బీరాలు పలికిన మంత్రుల్లో కొంతమంది అధిష్టానం మద్దతు రోశయ్యకేనని తేలడంతో తమ 'గళాన్ని' సవరించుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిగా చేయనంతవరకు ప్రమాణం చేయనన్న పి.రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా పొల్లు మాట లేదు. నిజానికి సెప్టెంబర్ 5న రోశయ్య మంత్రి మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముందుగా హాజరైంది పి రామచంద్రారెడ్డే!
వైఎస్ భౌతిక కాయం పోస్ట్ మార్టం కోసం ఇంకా కర్నూలు చేరకముందే... జగన్ ను సీఎంగా చేయాలని ఆత్మకూరులో డిమాండ్ చేసిన రఘువీరారెడ్డి కూడా ప్రస్తుతం రోశయ్యకు మద్దతు ఇస్తున్నారు. సెప్టెంబర్ 3 న జరిగిన కేబినెట్ భేటీలో జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని అధిష్టానాన్ని కోరుతూ తీర్మానం చేయాలన్న మంత్రులు దానం నాగేందర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కూడా మనసు మార్చుకున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది.
Pages: -1- 2 News Posted: 26 October, 2009
|