మంత్రి పదవి ఇవ్వరూ! ప్రస్తుత మంత్రివర్గంలో కొందరు అనామకులు ఉన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఎమ్మెల్యే పి.శంకరరావు ఆరోపించారు. సీనియారిటీని, సమర్థతను గుర్తించి మంత్రి పదవులు ఇవ్వాలని ఆయనన్నారు. కాగా డిఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ సీనియారిటీని గౌరవించి సమర్థత ప్రాతిపదికగా మాత్రమే మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని అన్నారు. మంత్రివర్గంలో సమర్థులుంటేనే ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధిష్ఠానవర్గం సూచన ప్రకారమే వివిధ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, మరో ఆరు నెలల్లో చక్కబడుతుందని డిఎల్ అన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అమలు జరగడంలేదని కడప ఎంపి జగన్మోహన్ రెడ్డి ఇటీవల విలేఖరుల సమావేశంలో చేసిన విమర్శలకు బదులు చెప్పేలా డిఎల్ వ్యాఖ్యలు ఉండటం విశేషం.
ప్రస్తుత మంత్రివర్గంలో అనామకులు అసమర్ధులు ఎవరూ లేరని వైఎస్ కు, జగన్ కు వీరవిధేయుడైన కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో ఉన్న వైఎస్ మంత్రివర్గమే కొనసాగుతుందని ఆయన అన్నారు. మంత్రి పదవుల్ని ఆశిస్తున్న కొందరు స్వార్థంతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలన్న అధిష్ఠానమే వైఎస్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రుల్నీ ప్రమాణం చేయాలని ఆదేశించిందని, అంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనామకుల్ని, అసమర్థుల్ని మంత్రివర్గ సభ్యులుగా ఎంపిక చేశారా అని జోగి రమేష్ ప్రశ్నించారు.
ఇలా ఉండగా కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని తన నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తానే సీనియర్ నని ఆయన చెప్పారు. అందువల్లనే తన నియోజకవర్గ ప్రజలకు తనకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. డి.ఎల్.రవీంద్రారెడ్డి, శంకర్‌రావు, కాటసాని రాంభూపాల్‌రెడ్డి... వంటి సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి విషయంలో తమ కోరికను చెప్పకనే చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేలు జానా, జెసి, మర్రి శశిధర్‌రెడ్డి, శంకర్‌రావు, డిఎల్.రవీంద్రారెడ్డిమంత్రివర్గ విస్తర ణలో తప్పకుండా స్థానం లభిస్తుందని రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రచారం జరుగుతోంది.
Pages: -1- 2 News Posted: 28 October, 2009
|