బుగ్గి అయిన 500 కోట్లు
ఐఒసి టెర్మినల్ లో నుంచి కొద్ది దూరంలోని భారత్ పెట్రోలియం (బిపిసిఎల్) టెర్మినల్ కు పెట్రోలును బదలీ చేస్తున్నప్పుడు పైప్ లైన్ వాల్వ్ పాడై మంటలు లేచినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తున్నదని ఐఒసి అధికారులు గురువారం చెప్పారు. లీక్ ఇందుకు కారణమని అధికారులు పదే పదే చెబుతున్నారు కాని మంటలు లేవడానికి ఏది కారణమైందో వారు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. డిపో నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు సమాచారం అందిన తరువాత సాయంత్రం సుమారు 4.30 గంటలకు నిలిపివేసిన విద్యుత్ సరఫరాను మొత్తం క్లియరెన్స్ వచ్చే లోపే రాత్రి సుమారు 7.30 గంటలకు పునరుద్ధరించారని కొందరు చెబుతున్నారు. స్వల్ప భూకంపం వల్ల అగ్ని జ్వాలలు లేచినట్లు మరి కొందరు సూచిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంపై కేంద్ర కమిటీ ఒకటి దర్యాప్తు జరపాలని శుక్రవారం నిర్ణయించారు. ఇందుకోసం నియమించిన ఐదుగురు సభ్యుల బృందానికి హెచ్ పిసిఎల్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) ఎం.బి. లాల్ సారథ్యం వహిస్తారు. కమిటీ ఆరు వారాలలోగా నివేదిక సమర్పించవలసి ఉంటుందని దేవరా తెలియజేశారు. దేవరా వెంట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సార్థక్ బెహూరియా ఉన్నారు. డిపోలో రక్షణ, సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించాలని బెహూరియాను కేంద్ర మంత్రి ఆదేశించారు. సమీపంలోని ఫ్యాక్టరీలలో నష్టాలను మదింపు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, సీతాపురా ప్రాంతంలోని ఫ్యాక్టరీలకు ఈ అగ్ని ప్రమాదం కారణంగా రూ. 300 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది.
అగ్ని జ్వాలలను కొంత వరకు అదుపు చేశారు. కాని దట్టంగా నల్లటి పొగ కమ్ముకొన్నది. ఇది సూర్యుని వెలుతురును కూడా అడ్డుకుంటున్నది. 'మేము చేయగలిగింది ఏమీ లేదు. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ముందు ఇంధనం పూర్తిగా దగ్ధం కావలసి ఉంటుంది' అని దేవరా శుక్రవారం తెల్లవారు జామున ఆ ప్రదేశంలో పరిశీలన అనంతరం చెప్పారు. మృతులకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలు తగిలినవారికి లక్ష రూపాయలు వంతున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఐఒసి తరఫున దేవరా ప్రకటించారు.
మథుర, ఢిల్లీ, పానిపట్ నుంచి, హజీరాలోని ఒఎన్ జిసి ప్లాంట్ నుంచి వచ్చిన అగ్నిమాపక దళ నిపుణులు ప్రజ్వరిల్లుతున్న మంటలను చూస్తూ నిశ్చేతనంగా నిలబడిపోయారు. శుక్రవారం మధ్యాహ్నానికి ఆ ప్రదేశానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 'డిపోలో ఇంకా పేలుళ్ళు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకే దానికి దగ్గరగా ఎవరినీ మేము వెళ్ళనివ్వడం లేదు. అదీ కాకుండా విషపూరిత వాయువులు ఆరోగ్యానికి హానికరం' అని జిల్లా కలెక్టర్ కులదీప్ రాన్కా చెప్పారు.
కాగా, ఆ ప్రాంతంలోని విద్యా సంస్థలు, పరిశ్రమలు అన్నిటినీ శుక్రవారం రోజంతా మూసివేశారు. ఆ ప్రాంతం మీదుగా సాగే రైలు, బస్సు రూట్లను కూడా మార్చారు. సీతాపురా ప్రాంతంలో గల మహాత్మా గాంధి ఆసుపత్రిని ఖాళీ చేయించారు.
Pages: -1- 2 News Posted: 31 October, 2009
|