పెటాకులైన పొత్తు
సోమవారం ఉదయం నుంచి పొత్తుల సీన్ గంట గంటకూ మారుతూ వచ్చింది. తొలుత ప్రజారాజ్యం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పొత్తు కు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, పొత్తు ఖరారు లాంఛనమే అనే సంకేతాన్ని పంపింది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు పీసీసీ అధ్యక్షుడు డీఎస్, మరి కొందరు సీనియర్ నేతలు ఈ అంశంపై ఉదయం నుంచి తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు. మరోవైపు జగన్ వర్గానికి చెందిన నేతలు మాత్రం ఎలాంటి పరిస్థితిలో చిరంజీవితో జట్టు కట్ట కూడదనే వాదనతో ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు ప్రారంభిం చారు. ఒక దశలో జగన్ స్వయంగా పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి పొత్తు ప్రతి పాదనలను రద్దు చేయిస్తారన్న ప్రచార మూ జరిగింది. సాయంత్రమయ్యేసరికి మొత్తం పరిస్థితి మారిపోయింది. ఉభయ పార్టీలూ వేటికవి తమది తప్పు కాదంటే, తమది తప్పు కాదని సర్దుకోవటం మొదలైంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వీరప్ప మొయిలీ ప్రస్తుతానికి పొత్తుల ప్రస్తావన లేదని, అది అసలు చర్చనీయాంశమే కాదని ప్రకటించారు. దీంతో అప్పటిదాకా పొత్తు కుదురుతుందన్న యోచనతో పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న డీఎస్ తదితరులు మాట మార్చారు. మరోవైపు మంత్రులు రఘువీరారెడ్డి పొత్తు కాదు...విలీనమే మేలు అంటూ కొత్త వాదన లేవదీశారు. గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ పొత్తుల విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు.
చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడానికే కాంగ్రస్ తో పొత్తని సమర్ధించుకోజూసిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పోకడలను చూసి ఖంగుతింది. ఇంకా పొత్తుకు తాము సానుకూలత ప్రకటిస్తే ప్రజల్లో పలచనైపోతామన్న సందేహం తలెత్తింది. ఏవో స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ వెంట తాము పడుతున్నామన్న భావన ప్రజల్లో మొలకెత్తక ముందే జాగ్రత్త పడాలని భావించింది. మొయిలీ ప్రకటన వెలవడిన తరువాత పొత్తు పొసగదని నిర్ధారించుకున్న ప్రజారాజ్యం నాయకులు పొత్తు కోసం తామేమీ వెంపర్లాడడంలేదంటూ వ్యాఖ్యలు చేశారు. తమకు పొత్తు ప్రధానం కాదని సి.రామచంద్రయ్య, హరిరామ జోగయ్య తదితరులు పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 2 November, 2009
|